For Money

Business News

వాల్‌స్ట్రీట్‌ మటాష్‌…

అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వస్తున్న ప్రతి పాజిటివ్‌ న్యూస్‌కు ఈక్విటీ మార్కెట్‌ కంగుతింటోంది. ఇప్పటికే గరిష్ఠ స్థాయి నుంచి 32 శాతంపైగా క్షీణించిన నాస్‌డాక్‌ ఇవాళ 3.5 శాతం తగ్గింది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 2.55 శాతం క్షీణిస్తే… డౌజోన్స్‌ 1.91 శాతం పడింది. సెప్టెంబర్‌ నిరుద్యోగ రేటు 3.7 శాతం ఉంటుందని అంచనా వేయగా… కేవలం 3.5 శాతం మాత్రమే నమోదైంది. అలాగే నాన్‌ఫామ్‌ రోల్స్‌ అంటే వ్యవసాయేత ఉద్యోగాల సంఖ్య ఆగస్టు 3.15 లక్షలు పెరగ్గా.. సెప్టెంబర్‌లో మరో 2.63 లక్షలు పెరిగింది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్ఠంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడైంది. అంటే ధరలు తగ్గుముఖం పట్టలేదని డేటా చెబుతోంది. దీంతో ఫెడరల్ బ్యాంక్‌ ఈసారి కూడా 0.75 శాతం చొప్పున వడ్డీ రేట్లను పెంచుతుందని 92 శాతం ట్రేడర్లు భావిస్తున్నారు. జాబ్ డేటా వచ్చిన వెంటనే ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్స్‌ ఒక శాతంపైగా పెరిగాయి. డాలర్ ఇండెక్స్‌ పెద్దగా పెరగకున్నా.. 112పైనే ఉంటోంది. జాబ్‌ డేటాతో ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, ఐటీ టెక్‌ షేర్లలో వస్తోన్న ఒత్తిడి చూస్తుంటే.. ఇప్పట్లో ఈ రంగం కోలుకునేలా కన్పించడం లేదు. ఇవాళ ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఏఎండీ షేర్‌ పది శాతంపైగా పడింది. టెస్లా ఇటీవల బాగా తగ్గింది. ఇవాళ కూడా ఆరు శాతంపైగా క్షీణించింది. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ షేర్లు కూడా నాలుగు శాతంపైగా తగ్గాయి. యాపిల్‌ షేర్‌ ఇవాళ మరో మూడు శాతం క్షీణించింది. 130 డాలర్ల నుంచి 170 డాలర్ల దాకా పెరిగిన యాపిల్‌ షేర్‌ ఇపుడు మళ్ళీ 140 డాలర్లకు వచ్చేసింది. ఇపుడు డౌజోన్స్‌ పడుతుండటంతో ఎకనామీ షేర్లు నమ్ముకున్న ఇన్వెస్టర్లు కూడా నష్టపోతున్నారు.