For Money

Business News

ఐపీఓకు వస్తున్న విజయా డయాగ్నోస్టిక్స్

కరోనా విజృంభణ తరవాత లిస్టయిన ఫార్మా, డియాగ్నోస్టిక్‌ కంపెనీల షేర్లు భారీ డిమాండ్‌ ఏర్పడింది. నిధులకు సమీకరణకు ఇదే సరైన సమయం అని భావిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన విజయ డయాగ్నోస్టిక్‌. పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. ఇష్యూలో భాగంగా విజయ డయాగ్నోస్టిక్‌ ప్రమోటర్‌ ఎస్‌ సురేంద్రనాథ్‌ రెడ్డి, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలైన కారకోరం లిమిటెడ్‌, కేదార క్యాపిటల్‌ ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లు తమ వద్ద ఉన్న 3.56 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. సంస్థ ప్రస్తుత ఈక్విటీలో ఇది దాదాపు 35 శాతానికి సమానం. విక్రయించనున్న షేర్లలో 30 శాతం వాటా.. పీఈ సంస్థలది కాగా 5 శాతం వాటా ప్రమోటర్‌కు చెందినది. 2016 డిసెంబరులో కేదార క్యాపిటల్‌ ఈ కంపెనీలో రూ.430 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా పీఈ సంస్థలు రెండూ తమ వాటాలను విక్రయించి విజయ డయాగ్నోస్టిక్స్‌ నుంచి పూర్తిగా తప్పుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఢిల్లీ, కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా 13 ప్రధాన నగరాల్లో కంపెనీకి 80 డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, 11 రిఫరెన్స్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.388.59 కోట్ల టర్నోవర్‌పై రూ.84.91 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.