For Money

Business News

యుద్ధ భయాలు: క్రూడ్‌..గోల్డ్‌ జూమ్‌

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతుందో లేదో తెలియడం లేదు. కాని షేర్‌ మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్ల స్పందన చూస్తుంటే యుద్ధం తప్పదేమో అన్న అనుమానం కల్గుతోంది. రాత్రి అమెరికా తన దేశ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. యుద్ధం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోందని… రానున్న 48 గంటల్లో ఎపుడైనా యుద్ధం ప్రారంభం కావొచ్చని హెచ్చరించింది. దీంతో వాల్‌ స్ట్రీల్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది. రాత్రి అమెరికా మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 0.52 శాతం పెరిగి 96ని దాటేసింది. ఒకవైపు డాలర్‌ పెరిగితే తగ్గాల్సిన క్రూడ్‌, బంగారం కూడా రాత్రి పరుగులు తీశాయి. ముఖ్యంగా క్రూడ్‌ ఆయిల్. ఎందుకంటే ఉక్రెయిన్‌పై దాడులు జరిగితే రష్యా నుంచి యూరో దేశాలకు క్రూడ్‌ సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. ప్రధాన ఆయిల్‌ పైప్‌ లైన్లు ఉక్రెయిన్‌ నుంచి వెళతాయి. యుద్ధ వార్తలు వచ్చిన వెంటనే క్రూడ్‌ ఏకంగా 4 శాతం పెరిగింది. మొన్నటి దాకా 90 డాలర్లు ఉన్న బ్రెంట్‌ క్రూడ్‌ (ఆసియా దేశాలు కొనే ఆయిల్‌) 95 డాలర్లను దాటింది. ఇక WTI క్రూడ్‌ 4.5 శాతం పెరిగింది.
ఇదే సమయంలో తగ్గాల్సిన బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న అమెరికా మార్కెట్‌ ప్రారంభ సమయంలో ఔన్స్‌ బంగారం ధర 1,821 డాలర్లు ఉండగా, ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 1,867 డాలర్లకు చేరింది. షార్ట్‌ కవరింగ్‌ కారణంగా 1,860 డాలర్ల వద్ద ముగిసింది.అయితే వెండిలో మాత్రం పెద్ద మార్పులేదు. దీనికి కారణం ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా బంగారానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం.