For Money

Business News

రాష్ట్రాలకు పెగసస్‌ ఆఫర్‌ వెనుక ఎవరు?

ఇపుడు పెగసస్‌ వివాదం మళ్ళీ ప్రధాని మోడీని ఇరకాటంలో పడేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెగసస్‌ను కొనుగోలు చేసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం రాసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కథనాన్ని ఖండించలేదు. భారత్‌కు అమ్మలేదని ఎన్‌ఎస్‌ఓ చెప్పలేదు. తీవ్రవవాదులపై నిఘాకు మాత్రమే ప్రభుత్వాలకు అమ్మామని ఎన్‌ఎస్‌ఓ చెబుతోంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉంది. కోర్టు నియమించిన కమిటీ కూడా తన నివేదిక ఇచ్చింది. కోర్టు త్వరలోనే తుది నిర్ణయం ప్రకటించే సమయంలో…. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జి బాంబు పేల్చారు. పెగసస్‌ కొనాల్సిందిగా ఇజ్రాయిల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ తమతో పాటు ఏపీని కూడా కోరిందని మమతా బెనర్జి అన్నారు. తాము కొనలేదని మమతా బెనర్జి అన్నారు. తాము కూడా ఆఫర్‌ను తిరస్కరించామని ఏపీ మాజీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. మమతా ప్రకటనతో రెండు విషయాలు స్పష్టమయ్యాయి. ఒకటి పెగసస్‌ను రాష్ట్రాలకు కూడా ఎన్‌ఎస్‌ఓ ఆఫర్‌ చేసింది. రెండోది కేంద్ర అనుమతి లేకుండానే పెగగస్‌ రాష్ట్రాలకు ఆఫర్‌ చేస్తుందా? అందులోనూ బీజేపీ బద్ధశత్రువు మమతా కూడా ఎన్‌ఎస్‌ఓ ఈ ఆఫర్‌ను ఎలా చేసిందనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఇలాంటి ఆఫర్‌ ఇతర రాష్ట్రాలకు కూడా చేశారా అన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఈ సాఫ్ట్‌వేర్‌ ఖరీదు రూ. 25 కోట్లని మమతా బెనర్జి వెల్లడించారు. మరి ఇంత మొత్తం కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్రాలు చెల్లించడం సాధ్యమా? కేంద్ర ఆర్థిక శాఖ అనుమతితోనే రాష్ట్రాలు కొనుగోలు చేయాలి. లేకుంటే విదేశీ కంపెనీలు నిధులు చెల్లించడానికి ఆర్బీఐ అంగీకరించదు. అంటే ఫలానా రాష్ట్రం కొనుగోలు చేసిందంటే… దానికి మోడీ ప్రభుత్వం అనుమతించిందనే చెప్పాలి. తాను కొనకుండా… రాష్ట్రాలు కొనుగోలు చేసేందుకు మోడీ ప్రభుత్వం అనుమతించిందా? వైకాపాలాంటి పార్టీలు ఇపుడు చంద్రబాబు పెగసస్‌ కొనుగోలు చేశారని ఆరోపణలు చేస్తున్నాయంటే… పరోక్షంగా మోడీ అనుమతించారనే అర్థం. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. మమతా బెనర్జి ప్రకటనతో పెగగస్‌ వ్యవహారం మళ్ళీ మోడీ వద్దకే చేరుతోంది.