For Money

Business News

‘చౌక చమురు’ ఏ రేటుకు అమ్ముతారు?

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు మనం ఎందుకు మద్దతు ఇస్తున్నామని అంటే… రష్యా నుంచి మనకు చౌకగా ముడి చమురు వస్తోందని అన్నారు చాలా మంది బీజేపీ నేతలు. మరి చౌకగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంటే ధరలు ఎందుకు తగ్గడం లేదు. పైగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. రష్యా సరఫరా చేసే యూరల్‌ ఆయిల్‌, మనం కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ సమాన ధరతో ట్రేడవుతుంటాయి. ఇటీవల బ్రెంట్‌ క్రూడ్‌ 100 డాలర్లకు కూడా వచ్చింది. 30 శాతం డిస్కౌంట్‌తో మనం ముడి చమురు దిగుమతి చేసుకున్నామంటే.. మనకు బ్యారల్‌ 70 డాలర్లకే వస్తోందన్నమాట. మరి అంత చవగ్గా ముడి చమురు వస్తున్నపుడు మార్కెట్‌లో ధరలు ఎందుకు తగ్గించడం లేదు.
గొప్పలు చెప్పేందుకే…
ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలోమన దేశం అనేక అంతర్జాతీయ వేదికలపై తటస్థ విధానం అంటూ పరోక్షంగా రష్యాకు మద్దతు పలికింది. తీరా 30 శాతం రాయితీతో రష్యా మనకు ఇస్తున్న ఆయిల్‌ ఎంతో తెలుసా? బీబీసీ కథనం ప్రకారం గత ఏడాది రష్యా నుంచి భారత్ రెండు శాతం అంటే 1.2 కోట్ల బ్యారెళ్ళ ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఈ ఏడాఇ జనవరి, ఫిబ్రవరిలో రష్యా నుంచి ఎలాంటి దిగుమతి లేదు. మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు గాను 2.6 కోట్ల బ్యారెళ్ళ చమురు దిగుమతికి భారత కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. అంటే గత ఏడాది మన మొత్తం అవసరాల్లో రెండు శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే ఈసారి నాలుగు శాతం దిగుమతి చేసుకుంటున్నాం. మరి మున్ముందు ఎంత దిగుమతి చేసుకుంటారో తెలియదు. కాకపోతే ఈ దిగుమతులకు మనం డాలర్లలో కాకుండా రూబుల్స్‌లో చెల్లింపులు చేస్తున్నాం. మరి తక్కువ రేటుకు ఆయిల్ తెచ్చినందున ప్రజలకు ఏమైనా చౌకగా అందిస్తారా అన్నది తెలియదు. కాని అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మొత్తం మన డిమాండ్‌లో రష్యా సరఫరా చాలా తక్కువ. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగినపుడల్లా అధిక ధరకు మనం కొనాల్సి ఉంటుంది. పేరుకు మనం చవగ్గా కొన్నామన్న మాటేగాని.. లాభం మాత్రం పెద్దగా లేదు. ప్రచారం చేసుకోవడానికి తప్ప.