For Money

Business News

చెన్నైలో చక్రం తిప్పుతున్న ఆ ముగ్గురు!

నిన్న తమిళనాడు విపక్ష నేత ఉదయానిధి స్టాలిన్‌ చేసిన కామెంట్స్‌ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా అమరావతిలో రాజకీయ నేతలందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో చెప్పాల్సిన పనిలేదు. సీఎం విజయ్‌ ప్రభుత్వం వెనుక ఆంధ్రాకు చెందిన ముగ్గురు రెడ్లు కీలక పాత్ర పోషిస్తున్నారని… మొత్తం మైనింగ్‌ మాఫియా వారి కనుసన్నుల్లోనే ఉందని ఉదయానిధి ఆరోపించారు. మైనింగ్‌తోపాటు ప్రభుత్వాన్ని కూడా వీరే నడుపుతున్నారని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒక్కొక్కటి త్వరలోనే బయటపెడతానని ఆయన సవాలు విసిరారు. ఆయన చెప్పిన ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు… విష్ణు వర్ధన్‌ రెడ్డి, సుజయ్‌ రెడ్డి, అనిల్‌ రెడ్డి.

విష్ణువర్దన్‌ రెడ్డి
చిత్తూరు జిల్లాకు చెందిన విష్ణువర్ధన్‌ రెడ్డిని సీఎం విజయ్‌ తన సలహాదారుగా నియమించినపుడే తమిళనాట తీవ్ర దుమారం రేగింది. చివరికి అధికారిక కార్యక్రమాల్లో కూడా విష్ణువర్ధన్‌ రెడ్డి హాజరు కావడంపై అప్పట్లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక కథనం రాసింది. విష్ణు వర్ధన్‌ రెడ్డి స్వగ్రామం ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, కలికిరికి సమీపంలోని ఎర్రదొడ్డి పల్లి. 15 ఏళ్ళ నుంచి చెన్నై కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇతను మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి స్వయంగా బావ. విష్ణువర్ధన్‌ రెడ్డిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాపార లావాదేవీలపై తమిళనాడు మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. దారాల అశ్విన్‌ కుమార్‌ రెడ్డి, దారాల తేజ్‌ కుమార్‌ రెడ్డి, దేవిరెడ్డి నందితాలతో కలిసి విష్ణువర్ధన్‌ రెడ్డి మైత్రి హౌసింగ్‌ ఎల్‌ఎల్‌పీ కూడా నెలకొల్పారు. వీరందరూ బంధువులేనని తెలుస్తోంది.
వైఎస్‌ అనిల్‌ రెడ్డి
ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి సోదరుడు వైఎస్‌ అనిల్‌ కుమార్‌తో కలిసి విష్ణువర్ధన్‌ రెడ్డికి ఉన్న వ్యాపార బంధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఇండో రాక్స్‌ ఎల్‌ఎల్‌పీలో భాగస్వామ్యులు. వీరిద్దరి కంటే ముందు ఈ కంపెనీకి డైరెక్టర్లుగా దేవిరెడ్డి, దారాల అశ్విని కుమార్‌ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. తన మరో సోదరుడు సునీల్‌ రెడ్డితో కలిసి వైఎస్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డి చెన్నై కేంద్రంగా మైనింగ్‌తో పాటు మద్యం వ్యాపారం చేస్తున్నారు. ప్రధానంగా ఎక్స్‌పోర్ట్‌ బిజినెస్‌ చేస్తున్నారు. మనదేశం నుంచి దక్షిణాఫ్రికా దేశాలకు మద్యం ఎగుమతులు చేశారు. ఏపీ మద్యం కేసులో విచారణలో భాగంగా చెన్నైలోని వైఎస్‌ అనిల్‌, సునీల్‌ కంపెనీలపై కూడా ఏపీ సీఐడీ అధికారులు దాడులు జరిపారు. దీనికి సంబంధించి తెలుగు మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. అయితే వైఎస్‌ అనిల్‌ రెడ్డి సోదరుడు వైఎస్‌ సునీల్‌ కుమార్‌ రెడ్డి కుమారుడి వివాహం తమిళనాడులో అతి పెద్ద పారిశ్రామిక సంస్థ మురుగప్పా గ్రూప్‌ కుటుంబంతో జరిగింది. సునీల్‌ కుమారుడు సాహిల్‌ వివాహం అరుణ్‌ మురుగప్పా కుమార్తె వేదికతో జరిగింది. ఈ వివాహానికి విజయ్‌, జగన్మోహన్‌ రెడ్డితో పాటు తమిళనాట అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ పొలిటికల్‌ కనెక్షన్స్‌ కారణంగానే మద్యం కేసు చెన్నై పొలిమేరల్లోనే ఆగిపోయినట్లుంది. సో… ఇపుడు ఉదయానిధి స్టాలిన్‌ ఆరోపణ ఏమిటంటే… విజయ్‌ పాలనలో అనిల్‌ రెడ్డి పాత్ర కూడా ఉందని.
ఎవరీ సుజయ్‌ రెడ్డి?
సుజయ్‌ రెడ్డి ( దేవిరెడ్డి సుజయ్‌ ఆనంద్‌ రెడ్డి) స్వయంగా విష్ణువర్ధన్‌ రెడ్డి బావ అని నిన్న మీడియా సమావేశంలో ఉదయానిధి స్టాలిన్‌ ఆరోపించారు. ఈయన కూడా మైనింగ్‌తో పాటు పలు రకాల వ్యాపారాల్లో ఉన్నారు. సుజయ్‌ రెడ్డి పెద్దగా కన్పించరు. ఆయన ఫొటోకూడా మీడియాలో రాదు. ఏఐఎస్‌, ఐపీఎస్‌ పోస్టులను సుజయ్‌ నిర్ణయిస్తారని ప్రముఖ సామాజిక కార్యకర్త సావుక్కు శంకర్‌ పేర్కొన్నారు. ఆయన సుజయ్‌ ఫోటోను ఫోటోను పోస్ట్‌ చేశారు. సత్యం సినిమా థియేటర్ల వివాదంలో ఆయన పేరు ప్రముఖంగా వచ్చింది. భార్యా భర్తల పేర్లతో వీరికి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతో వైఎస్‌ సునీల్‌, అనిల్‌ కూడా సంబంధాలు ఉన్నట్లు నెల్లూరు వాసులు అంటారు. వీరందరూ కూడా సీఎం విజయ్‌ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, ముఖ్యంగా మైనింగ్‌ లావాదేవీలన్నీ వీరి కనుసన్నుల్లో జరుగుతున్నట్లు ఉదయానిధి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే లాటరీ కింగ్‌ మార్టిన్‌ ఫ్యామిలీతో ఉన్న సంబంధాలపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.
కిరణ్‌ గవర్నర్‌గిరి?
విష్ణువర్ధన్‌ రెడ్డి, సుజయ్‌ రెడ్డిలు విజయ్‌ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణు వస్తున్న సమయంలో తమిళనాడు గవర్నర్‌గా నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వస్తున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పార్లమెంటులో మహిళా బిల్లు వస్తే… నిజయోవర్గ వర్గాల పునర్‌ విభజనకు విజయ్‌ మద్దతు ఇస్తారనే వార్తలు కూడా మీడియాలో వస్తున్నాయి. అంటే విజయ, మోదీ మధ్య పరోక్ష స్నేహానికి కిరణ్‌ రాక పనికి వస్తుందని డీఎంకే అనుమానిస్తోంది. కిరణ్‌ రావడం ఖాయమని, ఆయన రాకుండా ఉండేందుకే ఉదయానిధి ముందుస్తుగా ఈ ప్రకటన చేసినట్లు డీఎంకే వర్గాలు అంటున్నాయి. విజయ్‌కు జగన్‌ కోటరితో పాటు బీజేపీ కోటరికి కూడా దగ్గరయితే మున్ముందు తమ మరిన్ని కష్టాలు తప్పవని డీఎంకే నేతలు భావిస్తున్నారు. మరోవైపు కిరణ్‌కుమార్‌ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా వేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా అన్నది ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు గమనిస్తున్నారని… తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని టీడీపీ నేతలు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Reply