కాగ్నిజెంట్‌కు గ్రీన్ కార్డులు బంద్
వీసాల జారీలో దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కాగ్నిజెంట్‌పై అమెరికా చర్యలు తీసుకుంది. కంపెనీ ఇక నుంచి గ్రీన్ కార్డు ఫైలింగ్ దాఖలు చేయకుండా సస్పెండ్ చేసింది. కాగ్నిజెంట్‌తో పాటు డేటామేనేజ్‌మెంట్ దిగ్గజ సంస్థ క్లౌడెరాపై ఇలాంటి చర్యలే తీసుకుంది. గ్రీన్ కార్డుకు అవసరమయ్యే పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (Permanent Labor Certification) ఫైలింగ్స్‌ను అమెరికా నిలిపివేసింది. ఈ విషయాన్ని అమెరికా కార్మికశాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోని వెల్లడించారు. వీసాల దుర్వినియోగానికి సంబంధించి గత కొన్నేళ్ళుగా అమెరికా దర్యాప్తులు దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి మోసాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో అమెరికా సంస్థలు చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. కాగ్రిజెంట్, క్లౌడెరాలపై వైట్‌హౌజ్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేపట్టినట్లు ఆంథోని వెల్లడించారు. ఈ సంస్థలకు సంబంధించిన ఆర్థికమోసాలపై ఆరా తీస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కొత్తగా PERM ఫైలింగ్ చేయకుండా కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్‌పై అమెరికా కార్మిక శాఖ చర్యలు తీసుకుంది. దీనికి సంబంధిచిన దర్యాప్తు పూర్తి అయ్యేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కాగ్రిజెంట్ H-1Bతో పాటు PERM (ప్రొగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్) విషయంలో అనేక అక్రమాలకు పాల్పుడుతోందని విజిల్ బ్లోయర్ నుంచి ఫిర్యాదు వచ్చింది. అమెరికా తాజాచర్యలపై కాగ్నిజెంట్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
PERM అంటే ఏమిటి?
అమెరికాలో శాశ్వత ఉద్యోగాల కోసం విదేశీ వ్యక్తులను నియమించుకోవాలంటే ప్రభుత్వం నుంచి సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకున్న తరవాత నియామక ప్రక్రియ ప్రారంభమౌతుంది. దీన్నే ప్రొగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ లేదా PERM అంటారు.
సాధారణంగా తాము శాశ్వత ఉద్యోగం ఇచ్చే ఉద్యోగికి శాశ్వత నివాసం ఉండేలా ముందుగా కార్మిక శాఖ నుండి ధృవీకరణ పొందుతారు.తాము ఏ ఉద్యోగానికి విదేశీ ఉద్యోగిని తీసుకుంటున్నారో… అలాంటి ఉద్యోగానికి అర్హులైన అమెరికన్లు లేరని కార్మిక శాఖ వద్ద నిరూపించాల్సి ఉంటుంది. అలాగే సదరు విదేశీ ఉద్యోగి నియమించుకోవడం వల్ల అమెరికా కార్మికుల వేతనాలు లేదా పని పరిస్థితులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని యజమాని నిరూపించాల్సి ఉంటుంది. కంపెనీ వివరణతో సంతృప్తి చెందితే కార్మిక శాఖ ధృవీకరణ పత్రం జారీ చేసింది. ఆ తరవాత ఎంప్లామెంట్ బేస్డ్ గ్రీన్-కార్డ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. తదుపరి దశలతో ముందుకు సాగవచ్చు. కాగ్నిజెంట్‌కు సంబంధించి కార్మిక శాఖ తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఇక నుంచి కొత్త PERM ఫైలింగ్లకు అనుమతించరు. అయితే కాగ్నిజెంట్ ఇప్పటికే ఆమోదం పొందినవాటిని మాత్రం రద్దు చేయదు. అలాగే H-1B వీసా కార్యక్రమాన్ని కూడా ఆపదని కార్మిక శాఖ పేర్కొంది.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరవాత ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1బి ప్రోగ్రామ్ దుర్వినయోగంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో చాలా భారత కంపెనీలు ఫైలింగ్స్‌ను తగ్గించాయి. కాగ్నిజెంట్ కూడా 2018లో 10,189 దరఖాస్తు చేయగా, 2025లో దరఖాస్తుల సంఖ్య 3,436కి తగ్గించింది. కాగ్నిజెంట్‌పై చర్యతో ఇతర భారత కంపెనీల్లో గుబులు మొదలైంది. 1992లో చెన్నై కేంద్రంగా కాగ్నిజెంట్ ఏర్పాటైంది.
