For Money

Business News

రేషన్‌ షాపుల్లో 5కిలోల సిలిండర్లు

పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్‌ షాపులు నిర్వహిస్తున్న డీలర్లు ఇక నుంచి ఐదు కిలోల గ్యాస్‌ సిలిండర్లను విక్రయించుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కల్పించింది. ఈమేరకు ఏపీ పెట్రోలియం ఉత్పత్తుల ఆర్డర్‌కు సవరణ చేస్తూ పౌర సరఫరాల శాఖ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. 20 సిలిండర్లు నిల్వ చేసుకుని అమ్ముకోవచ్చని తెలిపింది. రేషన్ షాపు ల ద్వారా విక్రయించే డీలర్లకు సిలిండర్ ఒక్కంటికి రూ.41 కమిషన్ చెల్లిస్తారు. డిపాజిట్ రూపంలో రూ.940 చెల్లిస్తే రూ.620 లకే మినీ సిలెండర్ ఇస్తారని అధికారులు అంటున్నారు. (2014లో 5 కేజీ గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ. 150 ఉండేది)రేషన్ షాపులలో విక్రయాలను బట్టి 20 సిలిండర్లు నిల్వ చేసుకోవచ్చని అన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, పెద్ద గ్రామాలలో 5 కిలోల మినీ సిలెండర్లు ఎక్కువగా విక్రయాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహించామని రాష్ట్ర అధికారులు చర్చలు జరిపారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఛోటు పేరుతో, హిందుస్తాన్ పెట్రోలియం అప్పు పేరుతో, భారత్ పెట్రోలియం మినీ పేరుతో చిన్న సిలిండర్లను అమ్ముతున్నాయి. ఇవి ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్లు. వీటిని ఎవరైనా కొనొచ్చు. ఈ చిన్న సిలిండర్లు కొనడానికి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. కేవలం ఐడీ ప్రూఫ్ చూపించి ఈ సిలిండర్ తీసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా రీఫిల్ చేసుకోవచ్చు.