For Money

Business News

ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్యాక్సీ సేవలు..

‘కేరళ సవారీ’ పేరిట దేశంలోనే మొదటిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆన్‌లైన్‌ ట్యాక్సీ సేవలు కేరళలో ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిన్న ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించినా… ఇవాళ్టి నుంచి సర్వీసులు నడుస్తున్నాయ. తిరువనంతపురంలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నామని.. దశలవారీగా రాష్ట్రమంతటా విస్తరిస్తామని రాష్ట్ర కార్మిక మంత్రి వి.శివన్‌కుట్టి అన్నారు. మొత్తం 541 వాహనాలు నడుపుతున్నామని.. ఇందులో 321 ఆటో రిక్షాలు, 228 కార్లు ఉన్నాయని చెప్పారు. ఇతర ఆన్‌లైన్‌ ట్యాక్సీ సేవల ధరలు ఎప్పటికపుడు మారుతుంటాయని..కాని ‘కేరళ సవారీ’లో ఒకే ధర ఉంటుందని మంత్రి తెలిపారు. పైగా ఇతర ట్యాక్సీలలో సర్వీస్‌ చార్జి 20 శాతం నుంచి 30 శాతం దాకా ఉంటుందని… తాము మాత్రం 8 శాతమే వసూలు చేస్తామని… ఈ మొత్తాన్ని కూడా ప్రయాణికులు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి తెలిపారు. వాహనాల ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 60 శాతం డ్రైవర్లకు చెల్లిస్తారు. దీంతో పాటు ఈ వాహనాల్లో సబ్సిడీ రేటుతో జీపీఎస్‌ నెలకొల్పుతామని, అలాగే 24 గంటల కాల్ సెంటర్‌ కూడా ఉంటుందని మంత్రి తెలిపారు.మోటార్‌ వర్కర్స్ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల నేతృత్వంలో కేరళ సవారి నడుస్తుంది. నెలలోగా కొల్లం, కోచి, త్రిసూర్‌, కోళికోడ్‌, కన్నూర్‌ కార్పొరేషన్లలో ఈ సర్వీసును ప్రారంభించనున్నారు. కేరళ సవారీ యాప్‌ గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.