For Money

Business News

స్థిరంగా అమెరికా మార్కెట్లు

అమెరికా మార్కెట్లను రెండు అంశాలు ఇవాళ ప్రభావితం చేశాయి. ఒకటి ఈనెల నిరుద్యోగ భృతి కోసం దాఖలైన దరఖాస్తుల సంఖ్య అంచనాలకన్నా తక్కువగా ఉంది. పైగా పాత డేటాను అమెరికా లేబర్‌ విభాగం బాగా తగ్గించింది. అంటే అమెరికాలో ఉద్యోగ అవకాశాలు బాగున్నాయన్నమాట. దీంతో తుదపరి సమావేశంలో ఫెడ్‌ వడ్డీ రేట్లను అధికంగా పెంచుతుందేమో అన్న భయాలు మార్కెట్‌లో పెరిగాయి. ఇక రెండోది వారాంతపు చమురు నిల్వలు కూడా అంచనాలకన్నా ఎక్కువగా తగ్గాయి. అంటే పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం అమెరికాలో భారీగా ఉందన్నమాట. దీంతో ఆరంభంలో కాస్త అధిక నష్టాల్లో ఉన్న ఈక్విటీ మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి. నాస్‌డాక్‌ కేవలం 0.11 శాతం నష్టం, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 0.13 శాతం నష్టం… డౌజోన్స్‌ 0.34 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.డాలర్‌ ఇవాళ అనూహ్యంగా 0.7 శాతం పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 107ని దాటింది. నిల్వలు తగ్గడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 3 శాతం దాకా పెరిగాయి. చూస్తుంటే ఈక్విటీ మార్కెట్లు గ్రీన్‌లోముగుస్తాయేమో చూడాలి. ఎందుకంటే దాదాపు అన్ని యూరో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.57 శాతం లాభంతో ముగిసింది.