For Money

Business News

బార్‌ లేకుంటే… లక్షల మద్యం దేనికి?

గోవా బార్‌ వ్యవహారంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. చనిపోయిన వ్యక్తి పేరుతో బార్‌ లైసెన్స్‌ తీసుకుని.. అక్కడ మంత్రి కుమార్తె బార్‌ నిర్వహించారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. గోవాలోని సిల్లీ సోల్స్‌ గోవా బార్‌ అండ్‌ కేఫ్‌తో తన కుమార్తెకు ఏమాత్రం సంబంధం లేదని స్మృతి ఇరాని ఖండించారు. కోర్టులో పిటీషన్‌ కూడా వేశారు. కాని ఆమె అబద్ధం చెప్పారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఇవాళ వచ్చిన కథనం నిరూపించింది. గోవాలో ఉన్న కేఫ్‌ అడ్రస్‌… స్మృతి ఇరానీ కుటుంబానికి చెందిన ఎయిటాల్‌ ఫుడ్‌ అండ్ బేవరేజస్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ వ్యాపారం నడిపిన అ్రడస్‌ ఒకటే అని ఆ పత్రిక నిరూపించింది. ఎయిటాల్‌ ఫుడ్‌లో వాటాలు 75 శాతం స్మృతి కుటుంబానికే చెందినవని పేర్కొంది. తాజాగా ఈ వ్యవహరంపై మరింత లోతుగా అధ్యయనం చేసి ‘ద వైర్‌’ పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం రాసింది. ప్రముఖ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ రవి నాయర్‌ ఈ కథనాన్ని రాశారు. ఒకవైపు ఎయిటాల్‌ ఫుడ్‌ కంపెనీ కేంద్ర మంత్రి కుటుంబానికి చెందినదని చెప్పడంతో పాటు… ఆ కంపెనీ లావాదేవీల గురించి స్పష్టంగా ఈ కథనంలో వివరించారు. తన కుమార్తెకు బార్‌తో సంబంధం లేదని స్మృతి ఇరాని స్పష్టం చేశారు. అయితే ఆమె కుమార్తె, భర్తకు చెందిన ఎయిటాల్‌ ఫుడ్‌ కంపెనీ మద్యం కొనేందుకు రూ. 12.85 లక్షలు ఖర్చు పెట్టినట్లు తన బ్యాలెన్స్‌ షీట్‌లో పేర్కొంది. ఇదే అంశాన్ని ‘ద వైర్‌’ ప్రస్తావించింది. అలాగే రూ. 3.35 లక్షల విలువైన మద్యం స్టాక్‌ ఉన్నట్లు కూడా కంపెనీ పుస్తకాల్లో ఉన్న అంశాన్ని పేర్కొంది. అంటే… కేంద్ర మంత్రి ఫ్యామిలీకి చెందిన కంపెనీ మద్యం కొని, అమ్మింది. బార్‌ లైసెన్స్‌ లేకుండా ఆ కంపెనీ ఈ వ్యాపారం ఎలా చేసిందనేది కీలక ప్రశ్న. చనిపోయిన వ్యక్తి లైసెన్స్‌ను వాడుకుని… బార్‌ నిర్వహించారని కంపెనీ రికార్డులు చెప్పకనే చెబుతున్నాయి. ఎయిటాల్‌ ఫుడ్‌ కంపెనీ బార్‌ నిర్వహించినట్లు ఆ కంపెనీ ఖాతాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది గోవా రాష్ట్ర చట్టం ప్రకారం విరుద్ధం. ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు తొందరపడి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి దాఖలు చేసిన అఫిడవిట్‌ను గుడ్డిగా నమ్మి జడ్జి ప్రతివాదికి నోటీసులు జారీ చేశారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండానే… ప్రతివాది వాదనలు వినకుండా కోర్టు ఈ వ్యాఖ్యలు చేయడంతో… ఇటు రాజకీయ వర్గాల్లో… అటు న్యాయవాద వర్గాల్లోనూ ఇపుడు గోవా బార్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది.

(Click here for original story in English)