For Money

Business News

5జీకి రూ. 1.5 లక్షల కోట్లేనా!

యూపీఏ అధికారంలో ఉండగా స్పెక్ట్రమ్‌ను చాలా తక్కువ మొత్తానికి ఇచ్చేశారని… దీనివల్ల ఖజానాకు రూ.1.7 లక్షల కోట్ల నష్టం వచ్చిందని అప్పటి కాగ్‌ అధినేత వినోద్‌ రాయ్‌ లెక్కగట్టారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఆయన పలు పదవులతో తీరిక లేక ఉన్నారు. కాని చాలా తక్కవ ధరకు స్పెక్ట్రమ్‌ ఇవ్వడం వల్ల కాల్ చార్జీ పైసల్లోకి వచ్చేసిన విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. పైగా 2 జీ స్కామ్‌కు సంబంధించిన కేసులు కూడా ఒక్కోటి వీగిపోతున్నాయి. ఇది జరిగింది 2007లో. మరి 15 ఏళ్ళ తరవాత కేంద్ర ప్రభుత్వం 5జీ స్పక్ట్రమ్‌ను వేలం వేసింది. దీని ద్వారా వచ్చిన మొత్తం రూ.1.5 లక్షల కోట్లేనట అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 2జీ స్పెక్ట్రమ్‌ విలువ 15 ఏళ్ళ క్రితమే రూ.1.7 లక్షల కోట్లని చెప్పిన పెద్ద మనిషి ఇపుడు ఎక్కడ ఉన్నాడని వీరు ప్రశ్నిస్తున్నారు… అత్యాధునిక 5జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేస్తే ప్రభుత్వానికి ఎంత రావాలి? రూ.1.5 లక్షల కోట్లేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా ట్వీట్ చేస్తున్నారు. ఇందులో తిరకాసు ఏమిటంటే… స్పెక్ట్రమ్‌ కొన్న కంపెనీ వెంటనే మొత్తం సొమ్ము చెల్లించాల్సిన పని లేదు. ఆరంభంలో పది శాతం కడితే చాలు. తరవాత వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తారు. మరి స్కామ్‌ అపుడు జరిగిందా? ఇపుడు జరుగుతుందా? అని సోషల్ మీడియాలో జనం ప్రశ్నిస్తున్నారు.