For Money

Business News

బొగ్గు దిగుమతిపై వెనక్కి తగ్గిన కేంద్రం

రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అవసరమైన బొగ్గులో కచ్చితంగా పది శాతం బొగ్గును దిగుమతి చేసుకోవాలని షరతును కేంద్రం విధించిన విషయం తెలిసిందే. అనేక రాష్ట్రాలు ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగాయి. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచకుండా కేవలం మోడీ స్నేహితుడు అదానీ కోసమే బొగ్గు దిగుమతి ఆంక్ష విధించారని విమర్శించారు. ఇపుడు భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్‌ తగ్గింది. ఈ నేపథ్యంలో కూడా బొగ్గు దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి తేవడం మంచిది కాదని కేంద్రం భావించినట్లుంది. దీంతో ఇవాళ పది శాతం బొగ్గు దిగుమతి నిబంధనను సడలించింది. బొగ్గు లభ్యతను బట్టి ఆయా రాష్ట్రాలు, విద్యుత్‌ కంపెనీలు, బొగ్గు శాఖలు వారి అవసరాల మేరకు బొగ్గు దిగుమతి చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో సాధారణ స్థాయి కంటే 50 శాతం బొగ్గు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉంది. డిమాండ్‌ను బట్టి ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం పేర్కొంది.