For Money

Business News

నిఫ్టి లాభాలు నిలబడేనా?

ఇవాళ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్లేనని, తాము దాడులు ఆపేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదరనుందని ఆయన ప్రకటించారు. ఒప్పందం యూరప్‌లో కుదురుతుందని కూడా తెలిపారు. దీంతో క్రూడ్‌ ఆయిల్‌ తగ్గింది. రాత్రి కూడా వాల్‌స్ట్రీట్‌ చక్కటి లాభాలతో ముగిసింది. అయితే ట్రంప్‌ ప్రకటనలను మార్కెట్లు సీరియస్‌గా తీసుకుంటాయా అన్నది చూడాలి. దానికి ప్రధాన కారణం బ్రెంట్‌ క్రూడ్‌ కేవలం ఒక డాలర్‌ మాత్రమే క్షీణించడం. గంటలోనే మాట మారుస్తున్న ట్రంప్‌ ప్రకటనలపై మార్కెట్లు చాలా అప్రమత్తంగా ఉంటున్నాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ కూడా స్థిరంగా పెద్దగా లాభాలు లేకుండా ట్రేడవుతోంది. దీంతో మార్కెట్‌ లాభాలు మన్ముందు కొనసాగుతాయా అన్న అనుమానం కల్గుతోంది. నిఫ్టి ఇపుడు 23400పైన ట్రేడవుతోంది. ఇదే స్థాయిలో లాభాలు కొనసాగుతాయా? లేదా లాభాల స్వీకరణ ఉంటుందా అన్నది మిడ్‌ సెషన్‌కల్లా తెలిసే అవకాశముంది. అమెరికా ఫ్యూచర్స్‌ మరింతగా బలపడకపోయినా… ఇరాన్‌ నుంచి ప్రతికూల ప్రకటన వచ్చినా…ఈ లాభాలు కొనసాగే ఛాన్స్‌ తక్కువ. పైగా వీకెండ్‌లో రిస్క్‌ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు ఇష్టపడరు. రెండు రోజుల్లో ఏమైనా జరగవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఇరాన్‌ నుంచి సానుకూల ప్రకటన వస్తేగాని… మార్కెట్‌లో లాభాలు కొనసాగే ఛాన్స్‌ తక్కువ. ఈ నేపథ్యంలో నిఫ్టిపై ఒత్తిడి వస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి ఆయిల్‌ అనుబంధ కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. అలాగే నిఫ్టిలో ఇండిగో, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎటర్నల్‌, బజాజ్‌ ఫైనాన్స గ్రీన్‌లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ నష్టాల్లో ఉండగా, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, కోల్‌ ఇండియా, నెస్లే వంటి నిఫ్టి షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Leave a Reply