For Money

Business News

నష్టాలన్నీ హాంఫట్‌

అమెరికా ఫ్యూచర్స్‌ ఒక మోస్తరు నష్టాల్లో ఉన్నా… యూరప్‌ మార్కెట్లు ఒక శాతం దాకా నష్టాల్లో ఉన్నా… మన మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టంతో ప్రారంభమైన నిఫ్టి అర గంటలోనే దాదాపు క్రితం ముగింపు స్థాయికి వచ్చింది. కాని వెంటనే వచ్చిన అమ్మకాల ఒత్తిడితో 17215కి చేరింది. కాని అక్కడి నుంచి కోలుకుని మిడ్‌ సెషన్‌కల్లా చాలా వరకు నష్టాలను పూడ్చుకుంది. కాని యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడంతో… నిఫ్టి మళ్ళీ క్షీణించింది. కాని పడినపుడల్లా మద్దతు అందడంతో నిఫ్టి క్రమంగా బలపడుతూ క్లోజింగ్‌ సమయానికి గ్రీన్‌లోకి వచ్చేసింది. కాని చివరి అరగంటలో నిఫ్టి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. గ్రీన్‌ నుంచి రెడ్‌లోకి వెళ్ళినా కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ గ్రీన్‌లోకి వచ్చి ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 5 పాయింట్ల లాభతో రూ. 17345 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 20 పాయింట్లు లాభపడింది. నిఫ్టి స్థిరంగా క్లోజ్‌ కాగా, ఇతర సూచీలు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. నిఫ్టిలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్‌ టాప్‌ గెయినర్స్‌ కాగా, యూపీఎల్‌, హీరో మోటొ కార్ప్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. జొమాటొ పనితీరు మెరుగుపడుతున్నట్లు నిన్న ఫలితాలు చెప్పకనే చెప్పాయి. దీంతో ఇవాళ ఆ షేర్‌కు గట్టి మద్దుతు లభించింది. షేర్‌ ఏకంగా 20 శాతం లాభపడింది. అదానీ ట్రాన్స్‌ అయిదు శాతం లాభపడటం విశేషం. నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. పలు మిడ్‌ క్యాప్‌ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు ఇవాళ బాగా పెరిగాయి.