For Money

Business News

రిలయన్స్‌ చేతికి సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌!

అసెట్‌ కేర్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఏసీఆర్‌ఈ)తో కలిసి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ దాఖలు బిడ్‌కు సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ రుణదాతలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దివాలా తీసిన జౌళి ఉత్పత్తి సంస్థ సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ అమ్మకానికి రాగా రూ. 3650 కోట్ల రిలయన్స్‌ బిడ్‌కు రుణదాతలు అంగీకరించారు. ఇతర బిడ్లు వచ్చినా… రిలయన్స్‌ బిడ్స్‌ కన్నా తక్కువగా ఉన్నాయి. సింటెక్స్‌ కంపెనీ రూ. 7719 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది. అంటే బ్యాంకులకు సగం మొత్తం పోయినట్లే. రిలయన్స్‌ బిడ్‌కు ఇక అహ్మదాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలపాల్సింది. రిలయన్స్‌ చేసిన ప్రతిపాదన ప్రకారం సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ మూలధనాన్ని సున్నాకి తగ్గిస్తారు. కంపెనీని స్టాక్‌ ఎక్సే్ఛంజీలు, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నుంచి డీలిస్ట్‌ చేస్తారు. ఈ లెక్కన సింటెక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు మొత్తం కోల్పోయినట్లే. దివాలా ప్రక్రియలో టెక్స్‌టైల్‌ మిల్‌ను రిలయన్స్‌ కొనడం ఇది రెండోసారి. గతంలో అలోక్‌ టెక్స్‌టైల్‌ను 95 శాతం రుణాలకు కోత విధించి కొనుగోలు చేసింది. ఆ కంపెనీని కూడా డీలిస్ట్‌ చేసింది. అంటే ఇన్వెస్టర్లు మొత్తం కోల్పోయారు. 2020–21 ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంల, కంపెనీ కన్సాలిటేడెడ్‌ రూ.942.66 కోట్లకు చేరగా, నికర నష్టం రూ.103.25 కోట్లకు తగ్గింది. సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో సోమవారం 5 శాతం (లోయర్‌ సీలింగ్‌) నష్టపోయి రూ.7.80 వద్ద ముగిసింది. త్వరలోనే ఈ షేర్‌ను డీలిస్ట్‌ చేస్తారు.