For Money

Business News

బేర్‌ మార్కెట్‌లోకి వాల్‌స్ట్రీట్‌

ఇప్పటి వరకు బేర్‌ ఫేజ్‌కు దూరంగా ఉన్న ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా రాత్రి బుల్‌ ఫేజ్‌కు గుడ్‌ బై చెప్పింది. వడ్డీ రేట్లపై ఫెడరల్‌ రిజర్వ్‌ ఇవాళ నిర్ణయం తీసుకోనుండగా… అమెరికా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగడంతో బ్లూచిప్‌ షేర్లు కూడా నాలుగు నుంచి ఆరు శాతం దాకా పడ్డాయి. ముఖ్యంగా ఐటీ, టెక్‌ షేర్లలో భారీ ఒత్తిడి వచ్చింది. నాస్‌డాక్‌ 4.68 శాతం క్షీణించింది. ఈ లెక్కన రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లోనే దాదాపు 8 శాతం క్షీణించింది నాస్‌డాక్‌. ఐటీ, టెక్‌ షేర్లు ఎస్‌ అండ్‌ పీ 500లో కూడా ఉంటాయి. ఈ సూచీ కాస్త పటిష్ఠంగా ఉంటున్నా రాత్రి 3.88 శాతం క్షీణించింది. ఆల్ టైమ్‌ హై నుంచి ఈసూచీ కూడా 20 శాతంపైగా క్షీణించింది. ఇక డౌజోన్స్‌ సూచీ కూడా రాత్రి 876 పాయింట్లు అంటే 2.79 శాతం క్షీణించింది. వెరశి మొత్తం మూడు సూచీలు ఇవాళ బేర్‌ ఫేజ్‌లో ఉన్నాయి. ఫెడరల్‌ రిజర్స్‌ 0.5 శాతం మేర వడ్డీ పెంచుతుందని మార్కెట్‌ అంచనా వేసింది. కాని ఇపుడు కనీసం 0.75 శాతం లేదా ఒక శాతం పెంచుతారనేవారి సంఖ్య అధికమైంది. ఇవాళ ఫెడ్‌ తీసుకునే నిర్ణయం బట్టి వాల్‌స్ట్రీట్‌ తదుపరి దశ ఆధారపడి ఉంటుంది. బాండ్‌ ఈల్డ్స్‌ 3.32 శాతానికి చేరడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి బాండ్‌లకు మారుతున్నారు. అలాగే డాలర్‌ ఇండెక్స్‌ 105ని తాకింది. డాలర్‌ ఈ స్థాయిలో పెరిగినా క్రూడ్‌ 122 డాలర్ల ప్రాంతంలో ఉంటోంది. దీంతో అనేక కంపెనీల మార్జిన్లు భారీగా తగ్గే అవకాశముంది.