For Money

Business News

బెట్టింగ్‌ కంపెనీకి రూ. 21,000 కోట్ల ట్యాక్స్‌ నోటీసు

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కంపెనీ గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై రూ. 21000 కోట్ల పన్ను విధిస్తూ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పరోక్ష పన్నుల విభాగంలో ఒక కంపెనీకి ఈ స్థాయి పన్ను వేస్తూ షోకాజ్‌ నోటీసు జారీ కావడం ఇదే మొదటిసారి. ఈ కంపెనీ దాదాపు రూ. 21000 కోట్లకుపైగా జీఎస్టీని ఎగ్గొట్టిందని అధికారులు నోటిసులో పేర్కొన్నారు. రమ్మీ కల్చర్‌, గేమ్స్‌జి, రమ్మీ టైమ్‌ వంటి పలు కార్డ్‌, కాజువల్‌, ఫాంటసీ గేమ్స్‌ను ఈ కంపెనీ ప్రమోట్‌ చేసింది. 2017 నుంచి 2022 జూన్‌ మధ్య కాలంలో ఈ కంపెనీ రూ. 77,000 కోట్ల గేమింగ్‌ ఇన్‌వాయిస్‌లను విడుదల చేసినట్లు తేలింది. అంటే ఆ మేరకు గేమింగ్‌ బిజినెస్‌ చేసిందన్నమాట. దీనిపై 28 శాతం జీఎస్టీని విధిస్తూ అధికారులు నోటీసు జారీ చేశారు. తన కస్టమర్లకు గేమ్స్‌క్రాఫ్ట్‌ ఎలాంటి ఇన్‌వాయిస్‌లు జారీ చేయలేదని అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్‌ గేమ్‌లపై నగదు రూపంలో గేమర్స్‌ బెట్టింగ్‌ కట్టేందుకు ఈ కంపెనీ అనుమతించింది. దర్యాప్తులో తప్పుడు బిల్లులు సమర్పించినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ కంపెనీ ఖాతాలను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసినట్లు వెల్లడైంది. కంపెనీ వ్యాలెట్‌లోకి గేమర్స్ డబ్బు కట్టిన తరవాత తిరిగి ఇచ్చే పరిస్థితి లేదని.. అయినా భారీ ఎత్తున డబ్బు జమ చేసేలా గేమర్స్‌ను ఈ కంపెనీ ప్రోత్సహించిందని అధికారులు తెలిపారు.