For Money

Business News

ఇంకా పడుతుంది.. అపుడే కొనొద్దు

డాలర్‌ మెరుపుల ముందు బులియన్‌ కళ తప్పుతోంది. 20 ఏళ్ళ గరిష్ఠానికి తాకిన డాలర్‌ …ఇప్పట్లో తగ్గేదే లేదని అంటోంది. ఈ ఏడాది చివరికల్లా మరింతగా వడ్డీ రేట్లను పెంచడం ఖాయమని అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టం చేయడంతో డాలర్‌ పరుగులు పెడుతోంది. మాంద్యం కూడా త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణిస్తున్నాయి. నిన్న ఫార్వర్డ్‌ మార్కెట్‌లో స్టాండర్డ్‌ బంగారం అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 601 తగ్గి రూ. 49399ని తాకింది. అదే కిలో వెండి నవంబర్‌ కాంట్రాక్ట్‌ రూ.1574 తగ్గి రూ.56,870కి చేరింది. అదే అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే… డాలర్‌ ఔన్స్‌ బంగారం ధర 1651 డాలర్లకు, వెండి ధర 18.83 డాలర్లకు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి 1620 డాలర్ల వద్ద తొలి మద్దతు ఉంది.. ఆ స్థాయి కోల్పోతే 1580 డాలర్ల వద్ద రెండో గట్టి మద్దతు ఉంది. అంటే మన ఫార్వర్డ్‌ మార్కెట్‌లో చూస్తే స్టాండర్డ్‌ బంగారం 10 గ్రాముల ధర రూ.48,800 వద్ద వెంటనే మద్దతు, రూ. 47,700 వద్ద రెండో మద్దతు ఉంది. స్వల్ప కాలానికైతే బంగారాన్ని ఇపుడే కొనుగోలు చేయొద్దని అనలిస్టులు అంటున్నారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మాత్రం ఈ స్థాయి నుంచి బులియన్‌ మరింత తగ్గే పక్షంలో.. తగ్గినపుడల్లా కొద్దికొద్దిగా కొంటూ పోవాలని సూచించారు. స్పాట్‌ మార్కెట్‌లో 1620 డాలర్లు, ఎంసీఎక్స్‌లో రూ. 48800 వద్ద మద్దతు కోసం ఎదురు చూడమని వీరు సల
హా ఇస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లలో భారీ పతనం వస్తే బులియన్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ కాస్త మెరుగుపడినా… బులియన్‌ మార్కెట్‌ను నియంత్రించేది డాలర్‌ మాత్రమే. కాబట్టి డాలర్‌ స్థిపడేంత వరకు బులియన్‌ కొనుగోలు చేయొద్దని అనలిస్టులు అంటున్నారు.