For Money

Business News

ఈ సారి మరో అరశాతం వడ్డీ రేటు పెంపు?

వచ్చేవారం ఆర్బీఐ పరపతి విధానాన్ని సమీక్షించనుంది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాతో సహా అన్ని దేశాలు వడ్డీ రేట్లను పెంచాయి. పెంచుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 0.75 శాతం పెంచగా, ఈసీబీ అర శాతం మేర వడ్డీ రేటు పెంచింది. వచ్చే బుధవారం ఆర్బీఐ పరపతి సమీక్ష కమిటీ (ఎంపీసీ) భేటీ కానుంది. మూడు రోజుల భేటీ శుక్రవారం ముగుస్తుంది. అదే రోజు వడ్డీ పెంపునకు సంబంధించిన ప్రకటన చేయనుంది. ఈసారి వడ్డీ రేటు అర శాతం పెంచుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. దీంతో వరుసగా నాలుగు సార్లు వడ్డీ రేట్లు పెంచినట్లవుతుంది. మే నుంచి ఇప్పటి వరకు రెపో రేటును ఆర్బీఐ 1.4 శాతం మేర పెంచింది. ఇపుడు రెపో రేటు 5.4 శాతం ఉంది. ఇపుడు మరో అరశాతం పెంచితే.. రెపో రేటు 5.9 శాతానికి చేరుతుంది. ఇదే మూడు ఏళ్ళ గరిష్ఠ స్థాయి అవుతుంది. తాజాగా అంటే ఆగస్టు నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీ (సీపీఐ) ఏడు శాతానికి చేరిన విషయం తెలిసిందే. దీంతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుంది.