For Money

Business News

ప్రణయ్‌ రాయ్‌ రాజీనామా

న్యూ ఢిల్లీ టెలివిజన్ (ఎన్‌డీటీవీ) వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌ ప్రమోటర్‌ కంపెనీ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి రాజీనామా చేశారు. నిన్న జరిగిన కంపెనీ బోర్డు సమావేశం నుంచి ఇద్దరూ రాజీనామా చేసినట్ల ఎన్‌డీటీవీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. వీరి స్థానంలో ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సుదీప్‌ భట్టాచార్య, సంజయ్‌ పుగలియా, సెంథిల్‌ సిన్న చెంగల్వరాయన్‌లను డైరెక్టర్లుగా నియమించారు. ప్రణయ్‌ రాయ్‌ దంపతులు ప్రమోటర్ కంపెనీ నుంచి వైదొలగడంతో ఎన్‌డీటీవీ నుంచి వైదొలగుతారా అన్నది చూడాలి. ఎందుకంటే ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా అదానీ గ్రూప్‌ కంపెనీ 29.18 శాతం వాటాను దక్కించుకుంది. ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా నిన్న రాత్రి వరకు 53.27 లక్షల షేర్లను అదానీ గ్రూప్‌ సేకరించాయి. ఎన్‌డీటీవీలో ప్రణయ్‌ రాయ్‌ దంపతులకు 61.45 శాతం వాటా ఉంది. ఇందులో 29.18 శాతం అదానీ గ్రూప్‌ దక్కించుకోగా.. ప్రణయ్‌రాయ్‌ దంపతులకు ఇక మిగిలింది 32.26 శాతం వాటా. మరి ఈ వాటాను అదానీకి అమ్మేస్తారా? లేదా వాటాను కొనసాగిస్తారా అన్నది చూడాలి. అదానీ ఓపెన్‌ ఆఫర్‌కు కౌంటర్‌గా అధిక ధరతో ఆఫర్‌ ప్రకటించే అవకాశం ప్రణయ్‌ రాయ్‌కు ఉన్నా… అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో… కౌంటర్‌ ప్రకటించలేదని తెలుస్తోంది. ఇపుడు ఎన్‌డీటీవీలో ఏం జరుగుతుందనేది కీలకంగా మారింది.