For Money

Business News

గోధుమల ఎగుమతిపై నిషేధం

నిన్నటి దాకా ప్రపంచ దేశాల ఆకలి తీరుస్తున్నామని గొప్పలు చెప్పుకున్న మోడీ ప్రభుత్వం అపుడే తోక ముడిచింది. మనదేశం నుంచి గోధమలను వివిధ దేశాల్లో విక్రయించేందుకు 9 దేశాలకు ప్రతినిధులను కూడా మన ప్రభుత్వం పంపుతోందని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక రెండు రోజుల క్రితం పతాక శీర్షికతో వార్త కూడా రాసింది. మోడీ భజనలో మునిగిన ఆ పత్రికకు తెలియనిదేమిటంటే… తరువాతి రోజే ప్రభుత్వం గోధుమల ఎగుమతిని నిషేధిస్తుంది. కావాలని ఈ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం గోధుమల సేకరణ తగ్గించింది. ప్రైవేట్‌ కంపెనీలు, వ్యక్తులు భారీ ఎత్తున ఓపెన్‌ మార్కెట్‌లో గోధుమలను కొన్నారు. ఈలోగా వడగాలులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోధుమల దిగుబడి తగ్గ నుందని గణాంకాలు రావడంతో … వెంటనే ప్లేటు ఫిరాయించింది. కనీసం దేశంలో నిల్వలు ఎంతున్నాయి? ఉత్పత్తి ఎంత? అనే అంచనాలు కూడా లేకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో గోధుమల ఎగుమతికి అనుమతించిన ప్రభుత్వం.. దేశీయంగా ప్రైవేట్‌ కంపెనీల చేతుల్లో భారీగా గోధుమ నిల్వలు పేరుకునేలా చేసింది. చేయాల్సిందంతా చేశాక… నిన్న గోధుమల ఎగుమతులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయిదు ప్రధాన వెరైటీల గోధుమల ఎగుమతిని నిషేధించింది. మరోలా చెప్పాలంటే అన్ని రకాల గోధుమల ఎగమతిని ఆపేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ జారీ చేసిన వాటికి మాత్రం అనుమతిస్తారు. అలాగే ఇతర ప్రభుత్వాలతో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఉంటే.. వాటికి మాత్రం ఎగుమతులు కొనసాగుతాయి. వాణిజ్య ఎగుమతులు పూర్తిగా ఆగిపోయినట్లేనన్నమాట. దేశానికి అత్యంత కీలక ఆహారమైన గోధమల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆర్థికవేత్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం వద్ద కనీస డేటా లేదా అని ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్స్‌ మాదిరి… ఇపుడు గోధుమల విషయంలో కూడా ప్రభుత్వం వ్యూహం తలకిందులైందన్నమాట.