For Money

Business News

సినిమా టికెట్ల ధరలు: ప్రభుత్వానికి అధికారం లేదు

సినిమా టికెట్ల విషయంలో మహా అయితే ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పొచ్చని, అంతేకాని టికెట్ల ధరలు, చార్జీలను  నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు అన్నారు. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం తన అభిప్రాయాన్ని లైసెన్సింగ్‌ అథారిటీకి తెలియజేయొచ్చని, కాని తనకు తానుగా ధరలు నిర్ణయించే అధికారం లేదని తాత్కాలిక ఆదేశాల్లో ఆయన పేర్కొన్నారు. టికెట్ల ధరల విషయంలో ద మల్టి ప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వేసిన పిటీషన్‌ ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చింది. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సమయంలో… అందులో సర్వీస్‌ చార్జీలను కూడా చేర్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడాన్ని అసోసియేషన్‌ సవాలు చేసింది. అసోసియేషన్‌ తరఫున విజయవాడలోని పీవీఆర్‌ సినిమాస్‌ మేనేజర్‌ పిటీషన్‌ వేశారు. టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌లో సర్వీస్‌ చార్జీలు కలపడం ఏపీ సినిమాస్‌ (రెగ్యులేషన్‌) యాక్ట్‌ 1955కి విరుద్దమని పేర్కొన్నారు. ఇపుడు అమల్లో ఉన్న విధంగా టికెట్లను అమ్మే స్వేచ్ఛ థియేటర్‌ ఓనర్లకు ఉందని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇపుడున్న పద్ధతిలో థియేటర్‌లోనే ప్రేక్షకుడు సినిమా టికెట్‌ కొనుక్కోవచ్చు. ఆన్‌లైన్‌లోటికెట్‌ కావాలనుకునే వారికి సర్వీస్‌ చార్జి విడిగా వసూలు చేయొచ్చని తెలిపారు. అంటే ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ చార్జి … సినిమా టికెట్‌ ధరలో భాగంగా కాదని పిటీషనర్‌ పేర్కొన్నారు. జూన్‌ 15కి కేసు తదుపరి విచారణ వాయిదా వేస్తూ… ప్రతివాదులు కౌంటర్లు వేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ప్రేక్షకుడు గుంపులో వచ్చి టికెట్‌ కొనే అవస్థ లేకుండా అలాగే క్యూలో నిలబడకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ టికెట్‌ సర్వీసు అందిస్తున్నామని… ఇది అదనపు సౌకర్యమని పిటీషనర్‌ పేర్కొన్నారు. పార్కింగ్‌, ఇతర సర్వీసు మాదిరి ఆన్‌లైన్‌ టికెటింగ్‌ అనేది థియేటర్ అందించే అదనపు సేవ అని… రేట్‌ ఆఫ్‌ అడ్మిషన్‌ (సినిమా చూసేందుకు వసూలు చేసే టికెట్‌ ధర)లో భాగం కాదని పిటీషనర్‌ పేర్కొన్నారు.