For Money

Business News

కర్ణాటకకు కంపెనీలు గుడ్‌బై?

భారత సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం ఇమేజ్‌ మునుపెన్నడూ లేనివిధంగా దెబ్బతింటోంది. ఆ రాష్ట్రంలో మత పరమైన ఘర్షణలు పెరుగుతుండటంతో చాలా కంపెనీలు మరో రాష్ట్రానికి తరలి వెళ్ళేందుకు సిద్ధమౌతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే ఉంటే బెంగళూరు ఇమేజి దెబ్బతింటుందని బయోకాన్‌ అధినేత్రి కిరణ్‌ మజుందార్‌ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. బెంగళూరులో మౌలిక సదుపాయాలు లేవంటూ పోస్ట్‌ చేసిన… ఓ ట్వీట్‌ సమాధానం ఇస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ …. హైదరాబాద్‌కు రమ్మని ఆహ్వానం పలికారు. ఆ ట్వీట్‌లో చాలా మంది కర్ణాటకలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు పారిశ్రామిక వేత్తలు తమ స్థావరాన్ని పుణెకు, దుబాయ్‌కు మార్చుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్‌ చేసిన ప్రకటన ఇపుడు సంచలనం రేపుతోంది. కర్ణాటకలో మతపరమైన ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి తరలి వచ్చే పారిశ్రామికవేత్తలకు తాము అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన వెల్లడించారు. ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రికతో ఆయన మాట్లాడుతూ… తమిళనాడుకు తరలి వచ్చేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన ఆన్నారు. వారిని ఆకర్షించే రేసులో తాము ముందున్నామని చెప్పారు. అనేక మంది కర్ణాటక పరిస్థితిని తమ వద్ద ప్రస్తావిస్తున్నారని… ఆ అంశంపై తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. తమ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్లో 53 శాతం వృద్ధి ఉందని అన్నారు. ఫైనాన్షియల్‌ ఇన్వెస్టర్లు, కార్పొరేట్లను ఆకర్షించేందుకు రానున్న ఆరు నెలల్లో వివిధ దేశాల్లో ఈవెంట్‌లను నిర్వహించనున్నట్లు త్యాగరాజన్‌ వెల్లడించారు. విదేశీ పెట్టుబడుల కోసం తాము ఎక్కువగా ప్రయత్నిస్తున్నామని అన్నారు.