For Money

Business News

అమెజాన్‌పై రూ.202 కోట్ల జరిమానా

రిలయన్స్‌ ఫ్యూచర్‌ డీల్‌ను అడ్డుకుంటున్న అమెజాన్‌పై కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) భారీ జరిమానా విధించింది. ఫ్యూచర్‌ గ్రూప్‌తో 2019లో కుదిరిన ఒప్పందానికి గతంలో ఇచ్చిన అనుమతిని సస్పెండ్‌ చేసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టే సమయంలో అమెజాన్‌ సీసీఐ అనుమతి తీసుకుంది. అపుడు సీసీఐ సమర్పించిన వివరాల్లో అసలు ఉద్దేశాలను అమెజాన్‌ దాచిపెట్టిందని సీసీఐ ఇపుడు ఆరోపిస్తోంది. ఈ డీల్‌ను మళ్లీ కొత్తగా పరిశీలించాల్సి ఉందని 57 పేజీల లేఖలో పేర్కొంది. అప్పటి వరకు ఈ డీల్‌ నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టంచేసింది. సమాచారాన్ని దాచి పెట్టినందుకు రూ. 2 ఫైన్‌, సమాచారాన్ని నోటిఫై చేయనందుకు మరో రూ. 200 కోట్ల ఫైన్‌ను విధించింది. దీన్ని 60 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో 2019లో అమెజాన్‌ 200 మిలియన్‌ డాలర్ల మేర (49 శాతం) పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. పరోక్షంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌కు యాజమాన్య హక్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌ గ్రూప్‌ చెందిన కొన్ని వ్యాపారాలను రిలయన్స్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ.24,713 కోట్లు. అయితే ఈ డీల్‌ను అమెజాన్‌ వ్యతిరేకిస్తోంది. దీనిపై కోర్టును కూడా ఆశ్రయించింది. ఈలోగా సీసీఐ ఇవాళ్టి తీర్పుతో అమెజాన్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. మరి దీనికి అమెజాన్‌ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.