5 రోజుల్లో రూ. 1.91 లక్షల కోట్లు ఉఫ్!
ఏడాదిలో జెట్ స్పీడుతో పెరిగిన అదానీ గ్రూప్ షేర్ల కష్టాలు ఇంకా తొలగలేదు. ఇప్పటికీ అంటే నేడు కూడా అదానీ గ్రూప్‌కు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల్లో నాలుగు షేర్లు లోయర్ సీలింగ్ (ఒకరోజు ఇంతకన్నా తగ్గడానికి ఎక్స్ఛేంజీలు అనుమతించవు) వద్ద ముగిశాయి. అదానీ పోర్ట్స్ ఈ వారంలో తొలిసారి 7.33 శాతం లాభంతో క్లోజ్ కాగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ 8.76 శాతం లాభంతో ముగిసింది. గత సోమవారం నుంచి శుక్రవారం క్లోజింగ్ మధ్య కాలంలో ఈ ఆరు కంపెనీల మార్కెట్ విలువ రూ. 1.91 లక్షల కోట్లు తగ్గింది. ఈ కంపెనీలపై ప్రధాన ఆరోపణ.. మారిషస్‌కు చెందిన మూడు విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్ జప్తు చేసిందని. అదానీ కంపెనీతో పాటు పలు వార్తా సంస్థలు ఎన్‌ఎస్‌డీఎల్ వర్గాలను ఉటంకిస్తూ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఉన్న ఖాతాలను జప్తు చేయలేదని చెబుతున్నా… నాలుగు షేర్ల ధరలు మాత్రం ప్రతి రోజూ లోయర్ సీలింగ్ వద్ద ముగుస్తున్నాయి.
ఎందుకు అనుమానం?
ఈ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలపై అనుమానం ఎందుకు వస్తోందంటే… మారిషస్‌లో ఒకే అడ్రస్‌తో ఉన్న ఈ మూడు సంస్థలు తమ పెట్టుబడుల్లో 94.4 శాతం నుంచి 97.9 శాతం మొత్తాన్ని అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టడమే. దీంతో మార్కెట్‌లో ఈ పెట్టబడిదారులపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు ఆరు కాగా, నాలుగింటిలో మాత్రమే 25 శాతం వాటా ప్రజలకు ఉంది. చాలా వరకు వాటా ప్రమోటర్లు, విదేశీ ఇన్వెస్టర్లు, ఇతర సంస్థలకు ఉంది. జనం వద్ద ఉన్న షేర్లు కేవలం 5 శాతం మాత్రమేనని పలు వార్తా సంస్థలు రాస్తున్నాయి. దీంతో ఈ షేర్లను అదుపు చేయడం అదానీలకు సులభంగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ నాలుగు షేర్లు రోజూ ఎందుకు లోయర్ సర్క్యూట్‌లో క్లోజవుతున్నాయి.
విచిత్రమేమిటంటే… షేర్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) కాని, ఈ గందరగోళానికి కారణమైన ఎన్‌ఎస్‌డీఎల్ కాని ఇప్పటి వరకు అధికారికంగా స్పందించకపోవడం. ఈ మీడియా సంస్థకూ అందుబాటులోకి రాకపోవడం. ఇంకా విచిత్రమేమిటంటే… స్టాక్ ఎక్స్ఛేంజీలు కూడా మిన్నకుండిపోవడం.
