For Money

Business News

రూ. 80.65 కోట్ల నామా ఆస్తులు జప్తు

మనీ లాండరింగ్‌ చట్టం కింద టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 80.65 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ గ్రూప్‌నకు చెందిన రాంచి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌ కంపెనీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని డీఫాల్ట్‌ అయిన విషయం తెలిసిందే. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంపెనీలపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌, ఖమ్మం, ప్రకాశం జిల్లాలోని రూ. 67.08 కోట్ల విలువైన స్థిరస్తులతో పాటు మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌, మధుకాన్‌ గ్రానైట్స్‌తో పాటు ఇతర మధుకాన్‌ గ్రూప్‌లలో నామా నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న రూ.13.57 కోట్ల విలువైన షేర్లను ఈడీ జప్తు చేసింది. ఈ ఏడాది జులైలో నామా నాగేశ్వర రావుకు చెందిన రూ. 73.74 కోట్ల విలువైన 105 స్థిర ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలను వివిధ పనుల కోసం పలు గ్రూప్‌ కంపెనీలకు చెల్లించి.. దాదాపు రూ. 75.50 కోట్ల మొత్తానికి తమ షెల్‌ కంపెనీలకు తరలించినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఉషా ప్రాజెక్ట్స్‌, శ్రీ బీఆర్‌ విజన్స్‌, శ్రీ ధర్మశాస్త్ర కన్‌స్ట్రక్షన్స్‌, శ్రీ నాగేంద్ర కన్‌స్ట్రక్షన్స్‌, రాగిణి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, వరలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలకు నిధులు తరలించినట్లు ఈడీ తెలిపింది. వాస్తవానికి పనుల కోసం అడ్వాన్స్‌గా తీసుకున్న ఈ మొత్తాన్ని సొంత కంపెనీలకు తరలించారని… ఎలాంటి పనులు చేయాలని ఈడీ విచారణలో వెల్లడైంది. రాంచి ఎక్స్‌ప్రెస్‌వేస్‌ పేరుతో తీసుకున్న బ్యాంకు రుణాల్లో రూ.361.29 కోట్లను తరలించినట్లు తమ విచారణలో వెల్లడైందని ఈడీ పేర్కొంది.