For Money

Business News

వాల్‌స్ట్రీట్‌పై ఆశతో 17,300పైన నిఫ్టి

మిడ్‌ సెషన్‌లో ఓ మోస్తరు లాభాలతో ఉన్న యూరో మార్కెట్లు క్రమంగా బలపడటంతో మన మార్కెట్‌లో కూడా ఇన్వెస్టర్లకు విశ్వాసం పెరిగింది. ఎందుకంటే అప్పటికే వాల్‌స్ట్రీట్‌ ఒక శాతంపైగా లాభంతో ఉంది. దీంతో నిఫ్టి 17300పైన పటిష్ఠ స్థాయిలో ముగిసింది. క్రితం ముగింపుతో పోలస్తే నిఫ్టి 126 పాయింట్లు లాభపడి 17311 వద్ద ముగిసింది. మిడ్‌ సెషన్‌ నుంచి చివరి దాకా నిఫ్టి కాస్త అటూ ఇటుగా ఇదే స్థాయిలో కొనసాగడం విశేషం. నిఫ్టికి నిఫ్టి బ్యాంక్‌ అండగా నిలిచింది. నష్టాల్లో ఉన్న మిడ్‌ క్యాప్‌, నిఫ్టి నెక్ట్స్‌ సూచీలు కూడా అర శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నేతృత్వంలో ఇవాళ ర్యాలీ కొనసాగింది. నిఫ్టిలో 37 షేర్లు గ్రీన్‌లో ముగిసింది. నిఫ్టిలో ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు గెయినర్స్‌ టాప్‌ ఫైవ్‌లో నిలిచాయి. చాలా రోజుల తరవాత అదానీ గ్రీన్‌ మళ్లీ 7 శాతం లాభపడింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దాదాపు అయిదు శాతం లాభపడగా, పిడిలైట్‌ మూడు శాతం దాకా లాభపడింది. భారత్‌ ఫోర్జ్‌ గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇవాళ కూడా ర్యాలీ కొనసాగింది. ఇటీవల కాస్త బలహీనపడిన ఇండియా హోటల్స్‌ ఇవాళ మూడు శాతం లాభపడింది. బ్యాంక్‌ నిఫ్టిలోని అన్ని షేర్లు గ్రీన్‌లో ముగియడం విశేషం.