For Money

Business News

నిఫ్టి నుంచి దివీస్‌ ఔట్‌?

ఎన్‌ఎస్‌ఈ 50 సూచీలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. జులై చివర్లో ఈ మార్పులు పూర్తి కానున్నాయి. ఆగస్టు నెల చివరి వారంలో కొత్త లిస్ట్‌ను ఎన్‌ఎస్‌ఈ ప్రకటించనుంది. సెప్టెంబర్‌ 30 నుంచి కొత్త షేర్ల లిస్ట్‌తో నిఫ్టి ట్రేడ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నిఫ్టి నుంచి ఎల్‌టీఐ మైండ్‌ ట్రీతో పాటు దివీస్‌ల్యాబ్‌ షేర్లు నిఫ్టి నుంచి బయటకు వెళ్ళే అవకాశముంది. జులై నెలాఖరున షేర్ల సగటు మార్కెట్‌ క్యాప్‌ ఆధారంగా నిఫ్టిని పునర్‌ వ్యవస్థీకరించనున్నారు. ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ కౌంటర్‌ నుంచి 18.6 కోట్ల డాలర్లు, దివీస్‌ ల్యాబ్‌ కౌంటర్ నుంచి 21.3 కోట్ల డాలర్ల ఔట్‌ఫ్లోకు ఛాన్స్‌ ఉంది. ఇక ఈ రెండు షేర్ల స్థానంలో కొత్తగా వచ్చే షేర్లపై మార్కెట్‌లో చర్చ జరుగుతోంది. నిఫ్టిలోకి టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్‌తోపాటు బీఈఎల్‌ షేర్లు నిఫ్టిలోకి వస్తాయని భావిస్తున్నారు. నిఫ్టి50లో ఇప్పటికే అయిదు టాటా గ్రూప్‌ షేర్లు ఉన్నాయి. ట్రెంట్‌ వస్తే ఆరో కంపెనీ అవుతుంది. అయితే ఎఫ్‌ అండ్‌ ఓ కేటగిరిలోకి జొమాటో, జియో ఫైనాన్స్‌ చేరేందుకు రెడీగా ఉన్నాయి. సెబీ ఆమోదమే తరవాయి. ఆగస్టులోగా సెబీ గనుక గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే… నిఫ్టిలోకి జొమాటొ, జియో ఫైనాన్స్‌ చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. పైగా ఆగస్టులో బీఈఎల్‌ కంటే హెచ్‌ఏఎల్‌ షేర్‌ బాగా రాణిస్తే ఆ షేర్‌కు ఛాన్స్‌ ఉంది. ఇది జరగాలంటే ఆగస్టులోగా బీఈఎల్‌ షేర్‌ కనీసం 20 శాతంపైగా పెరగాల్సి ఉంది. గత మార్చిలో జరిగిన మార్పుల్లో భాగంగా యూపీఎల్ స్థానంలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌ వచ్చి చేరిన విషయం తెలిసిందే. ఇపుడున్న షేర్లలో నిఫ్టిలో 11.48 శాతం వెయిటేజీతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మొదటిస్థానంలో ఉండగా తరువాతి స్థానంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉంది.