For Money

Business News

మీకు రుణముందా… వాయిదాలు మార్చుకోండి!

కరోనా సెకండ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈనెల ఆరంభంలో చిన్న వ్యాపార సంస్థలతో పాటు వ్యక్తులను దృష్టి పెట్టుకుని మరోసారి రుణ పునర్‌ వ్యవస్థీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే రూ. 25 కోట్ల లోపు ఉన్న రుణాలకు మాత్రమే ఈ తాజా సౌలభ్యం అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే గత ఏడాది ఇచ్చిన పునర్‌ వ్యవస్థీకరణను వాడుకుని ఉంటే ఈసారి అవకాశం ఉండదు. అంటే ఒక పునర్‌ వ్యవస్థీకరించిన రుణాన్ని మళ్ళీ పునర్‌ వ్యవస్థీకరణకు అంగీకరించరు. దీనికి సంబంధించి ఆయా బ్యాంకులు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డు తాజాగా తమ ఖాతాదారులకు ఈ అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. రూ. 25 కోట్ల లోపు ఉన్న రుణాల పునర్‌ వ్యవస్థీకరణకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రుణ గ్రస్తులను కోరింది.ఇపుడు పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ బోర్డు కూడా ఇదే తరహా సౌకర్యం అందిస్తోంది. ఈ సౌలభ్యం చిన్న, మధ్య వ్యాపార సంస్థలతో పాటు వ్యక్తిగత రుణాలకు కూడా వర్తిస్తుంది. అయితే సదరు రుణాలు 2021 మార్చి 31వ తేదీ వరకు స్టాండర్డ్‌ రుణాలుగా బ్యాంకులు వర్గీకరించి ఉండాలి. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఈ సౌలభ్యం ఉంటుంది. ఈ సౌలభ్యం తీసుకోవడానికి అంగీకరిస్తే బ్యాంక్‌ 90 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.