For Money

Business News

బ్యాంక్‌ CEOగా గరిష్ఠంగా 15 ఏళ్ళే

ఏదైనా ఒక కమర్షియల్‌ బ్యాంక్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (CEO) ఒకే వ్యక్తి 15 ఏళ్ళు మించి ఉండటానికి వీల్లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ఈ మేరకు కొత్త నిబంధనలను ఇవాళ ప్రకటించింది.కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. అలాగే హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా కూడా అంటే మూడు పదవుల్లోనూ ప్రమోటర్‌ లేదా ప్రధాన వాటాదారుగా ఉంటే… అతను/ఆమె 12 ఏళ్ళకు మించి ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితుల్లో ఈ కాలపరిమితిని 15 ఏళ్ళకు పొడిగించవచ్చని, అయితే దీనికి ఆర్బీఐ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఒక బ్యాంకులో 15 ఏళ్ళ పాటు CEOగా ఉంటే… మూడేళ్ళ కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ తరవాత మళ్ళీ అతను/ఆమె ఆ పదవి చేపట్టవచ్చు. అయితే మూడేళ్ళ కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌లో ఆ బ్యాంక్‌ లేదా దాని అనుబంధ సంస్థలలో ఎలాంటి పదవులు నిర్వహించరాదు. అలాగే ప్రైవేట్‌ బ్యాంక్‌లో ఈ పదవికి గరిష్ఠ వయోపరిమితి 70 ఏళ్ళు కొనసాగుతుందని… అవసరమైతే బ్యాంకుల బోర్డులు ఈ వయో పరిమితిని తగ్గించుకోవచ్చని పేర్కొంది.