For Money

Business News

పత్తి దిగుమతులపై సుంకాలు ఎత్తివేత

దేశంలో పత్తి ధరలు పెరిగి రైతులు సంతోషిస్తున్న సమయంలో కేంద్రం వారిని దారుణంగా దెబ్బతీసింది. పత్తి ధరలు భారీగా పెరుగుతున్నాయని.. కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయని… పత్తి దిగుమతులపై అన్ని రకాల సుంకాలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇప్పటి వరకు పత్తి దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం, అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌(AIDC) పేరుతో మొత్తం 11 శాతం సుంకాలు విధించేది. ఇపుడు ఈ సుంకాలన్నింటిని ఎత్తేసింది. దీంతో తక్కువ ధరకు విదేశాల నుంచి మిల్లులు దిగుమతి చేసుకునే వీలు కల్పించింది. ఈ ఏడాది పత్తి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పైగా వచ్చే పంట దిగుబడి కూడా తక్కువగా ఉంటుందన్న అంచనాలతో పత్తి ధరలు రైతులకు గిట్టుబాటు అవుతున్నాయి. పత్తి సీజన్‌ (2021-22) గత అక్టోబర్‌ నుంచి ప్రారంభమైంది.. కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అంచనా ప్రకారం 335 లక్షల బేళ్ళ పత్తి దిగుబది వచ్చేలా ఉంది. ఇది గత సీజన్‌తో పోలిస్తే 2.3 శాతం తక్కువ. ఆ మాత్రానికే పత్తి కొరత ఏర్పడుతోందని కార్పొరేట్‌ అనుకూల మీడియా వార్తలు రాసింది. వెంటనే ప్రభుత్వం స్పందించి సెప్టెంబర్‌ దాకా ఈ మొత్తం సుంకాలను ఎత్తివేసింది. మిల్లుల దాదాపు 25 లక్షల బేళ్ళ పత్తిని దిగుమతి చేసుకుంటాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దేశీయ మార్కెట్‌లో కొనకుండా ధరలు తక్కువగా ఉన్న ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఆఫ్రికా దేశాలతో పాటు అమెరికా నుంచి పత్తని దిగుమతి చేసుకుంటాయి.
ఉత్సాహం పోయే
పత్తి మార్కెట్‌లో ధరలు తగ్గించడానికి వ్యాపారస్తులకు ఇదొక్క సాకు చాలు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న పత్తి మార్కెట్లలో ఈ కారణంతో పత్తి ధరలను బ్రోకర్లు భారీగా తగ్గించేస్తారు. దీంతో ఇప్పటి వరకు పత్తి మార్కెట్లలో ఉన్న ఉత్సాహం నీరుగారుపోయేలా కేంద్రం చేసింది. అధిక ధరలతో పత్తి కొని దుస్తులు తయారు చేస్తే… ధరలు పెరుగుతాయని.. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడలేని కంపెనీలు అంటున్నాయి. 25 లక్షల బేళ్ళపై దిగుమతి సుంకం ఎంతో లెక్కించి… ఆ మొత్తం కంపెనీలకు ఎగుమతి ప్రోత్సాహం కింద ప్రభుత్వం ఇస్తే సరిపోతుంది. కాని ప్రభుత్వ ఉద్దేశం మార్కెట్‌లో ఉత్సాహాన్ని నీరుగార్చి.. తక్కువ ధరకు మిల్లులు పత్తిని కొట్టేయడం.