For Money

Business News

కిమ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ… దరఖాస్తు చేయండి

మనకు కిమ్స్‌ హాస్పిటల్‌గా పేరొందిన కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సస్‌ లిమిటెడ్‌ (కిమ్స్‌) ఈనెల 16వ తేదీన క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశిస్తోంది. ఆఫర్‌ ఈనెల 18న ముగుస్తుంది. రూ. 200 కోట్లు కొత్త షేర్ల జారీ చేస్తుండగా రూ. 1943.74 కోట్ల విలువైన షేర్లను ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు అమ్మేయనున్నారు. అంటే మొత్తం రూ. 2143.74 కోట్ల విలువైన 2,59,84,780 షేర్లను ఆఫర్‌ చేస్తోంది. పది రూపాయల ముఖ విలువ గలిగిన ఒక్కో షేర్‌ కనిష్ఠ ధర రూ. 815 కాగా, గరిష్ఠ ధర రూ. 825. కంపెనీ ఉద్యోగులకు మాత్రం రూ. 40 డిస్కౌంట్‌ ఇస్తోంది. కనీసం 18 షేర్లకు ఆ తరవాత 18 గుణకాలలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ ఈక్విటీ రూ. 77.59 కోట్లు కాగా, ఐపీఓ తరవాత కంపెనీ ఈక్విటీ రూ. 80.02 కోట్లకు చేరుతుంది. గరిష్ఠ ధరను లెక్కలోకి తీసుకుంటే కంపెనీ మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ రూ. 6,601 కోట్లకు చేరుతుంది. ఐపీఓ ద్వారా ఆఫర్‌ చేస్తున్న షేర్లలో ఏకంగా 75 శాతం షేర్లను క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బిడ్డర్స్‌ (QIB)కు హైనెట్‌వర్త్‌ ఇన్వెస్టర్స్‌కు 15శాతంషేర్లను ఆఫర్‌ చేస్తోంది. అంటే ఇష్యూలో రీటైల్‌ ఇన్వెస్టర్లకు కేవలం పది శాతం షేర్లను మాత్రమే ఆఫర్‌ చేస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ మొన్నటి దాకా నష్టాల్లో ఉన్నా… ఇష్యూకు మందు లాభాల్లోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్స్‌ను టేకోవర్‌ చేయడం ద్వారా బాగా విస్తరించింది. పబ్లిక్‌ ఇష్యూ తరవాత చెన్నై, బెంగళూరు నగరాలకు కూడా విస్తరించాలని భావిస్తోంది. మార్చి 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1,128 కోట్ల టర్నోవర్‌పై రూ. 215.36 కోట్ల నికర లాభం ఆర్జించింది. మార్చి 2021తో ముగిసిన ఏడాదిలో రూ. 1340 కోట్ల టర్నోవర్‌పై రూ. 205 కోట్ల నికర లాభాన్ని అంచనా వేస్తోంది. ఇదే ఏడాది ఎన్‌ఏవీ ఆధారంగా ప్రైస్‌ టు బుక్‌ వ్యాల్యూ 7.15 కాగా, పబ్లిక్ ఇష్యూ తరవాత ప్రైస్‌ టు బుక్‌వ్యాల్యూ రూ. 6.21 అని కంపెనీ పేర్కొంది. అంటే ఆఫర్‌ ధర 32.13 పీఈకి సమానంగా ఉంది. ఇప్పటి వరకు కంపెనీ డివిడెండ్‌ ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాలో అపోలో హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్‌, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వంటి హాస్పిటల్స్‌తో పోటీ ఉన్నా…ప్రస్తుత స్టాక్‌ మార్కెట్‌లో హెల్త్‌ కేర్‌ రంగానికి చెందిన షేర్లకు గట్టి డిమాండ్‌ ఉంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో ఒక్క అపోలో మాత్రమే లిస్టెడ్‌ కంపెనీ. అపోలో కంపెనీ షేర్‌ ఇపుడు ఏకంగా 100 రెట్లు పీఈతో మార్కెట్లో ట్రేడవుతోంది. ఆ లెక్కన చూస్తే కిమ్స్‌ హాస్పిటల్‌ షేర్‌ ధర హేతుబద్ధంగా కన్పిస్తోందని అనలిస్టులు అంటున్నారు. స్వల్ప, మధ్య కాలంలో కూడా ఈ కంపెనీ రాణించే అవకాశముంది. కాబట్టి ఈ ఆఫర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.