For Money

Business News

DHFL‌: షేర్ల ట్రేడింగ్‌లో మరో స్కామ్‌

ఆర్థిక అవకతవకలు, కుంభకోణం కారణంగానే DHFL దివాలా తీసింది. ఇప్పటికే ఈ షేర్‌ను కొన్న ఇన్వెస్టర్లు నట్టేట మునిగారు. మిగిలిన కొంతమందికైనా.. కొంత విలువ వస్తుందని ఆశించారు. కాని పెద్దల నాటకంలో చిన్న ఇన్వెస్టర్లు దివాలా తీశారు. దీనికి స్టాక్‌ మార్కెట్‌ పెద్దలు చెప్పే కంపుకొట్టే సామెత… మార్కెట్‌లో రిస్క్‌ ఉంది కదా? ఈ షేర్లు కొనద్దని హెచ్చరించాము కదా అని? మరి ఇలాంటి డీల్స్‌లో రుచి సోయా కొన్నవారు కోటీశ్వరులయ్యారు కదా? అయినా స్టాక్‌ ఎక్స్ఛేంజీలు కూడా మోసం చేస్తే ఎలా?
జరిగిందేమిటంటే…
దివాలా తీసిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీని ముకేష్‌ అంబానీ వియ్యంకుడు అజయ్‌ పిరమల్‌కు చెందిన పిరమల్‌ గ్రూప్‌ కంపెనీ కొనడానికి ముందుకు వచ్చింది. చర్చలు జరిగాయి. అప్పు ఇచ్చిన బ్యాంకులు కూడా ఈ డీల్‌కు అంగీకరించాయి. ఈ డీల్‌ సంబందర్భంగా కుదిరిన ఒప్పందం, అందులోని షరతులు ఆ కంపెనీ యజమానులకు తెలుసు. వారి లాయర్లకు తెలుసు. బ్యాంకర్లకు తెలుసు. ఎన్‌సీఎల్టీలో ఉన్న జడ్జీలకు తెలుసు. అక్కడి సిబ్బంది కూడా తెలుసు. కాని ఆ కంపెనీ వాటాదారులకు మాత్రం తెలియదు. DHFL టేకోవర్‌కు సంబంధించిన పిరమల్‌ గ్రూప్‌ ఇచ్చిన ప్రతిపాదనకు, అందులోని షరతులకు ఎన్‌సీఎల్‌టీ అంగీకరించింది. కాని అందులో వివరాలు బయటకు వెల్లడించలేదు. స్టాక్‌ మార్కెట్‌లోDHFL షేర్లు ట్రేడవుతున్నాయి. పిరమల్‌ వంటి గ్రూప్‌ టేకోవర్‌ చేస్తున్నందున.. మున్ముందున DHFLకు మంచి భవిష్యత్తు ఉందని చాలా మంది కొన్నారు. ఇలా టేకోవర్‌ చేసిన కంపెనీల షేర్లు ఇటీవల బాగా పెరిగినందున చాలా మంది మార్కెట్‌ విశ్లేషకులను పట్టించుకోలేదు. DHFL షేర్లను విలువను జీరో చేసి… వాటాదారులకు పైసా ఇవ్వకుండా DHFLను పిరమల్‌ గ్రూప్‌ టేకోవర్‌ చేస్తోందని మీడియాలో కథనాలు వచ్చాయి. సాధారణంగా ఇలాంటి కథనాలు వస్తే వెంటనే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు కంపెనీ నుంచి సమాధానం తీసుకుంటాయి. దాన్ని ఎక్స్ఛేంజీ వెబ్‌సైట్‌లో ఉంచుతాయి. కాని అలాంటిదేం జరగలేదు. ఈనెల 8వ తేదీన ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇదే విషయాన్ని DHFL స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కాని DHFL షేర్లకు జీరో వ్యాల్యూకు కొంటున్న సంగతి దాచింది. మార్కెట్‌లో షేర్‌ పది శాతం దాకా పెరిగింది. మళ్ళీ స్వల్ప లాభంతో ముగిసింది. మరుసటి రోజు అంటే 9న DHFL మరో నోటీసు ఇచ్చి… తమ కంపెనీ షేర్ల విలువను ఆడిటర్లు జీరోగా లెక్కించారని తెలిపింది. వెంటనే వెబ్‌సైట్‌లో పెట్టాల్సిన స్టాక్‌ ఎక్స్ఛేంజీలు పెట్టలేదు. ఇంత జరుగుతున్నా 10,11 తేదీలలో కూడా షేర్‌ ట్రేడింగ్‌కు ఎక్స్ఛేంజీలు అనుమతించాయి. రూ. 22ల నుంచి షేర్‌ పడుతూ వస్తోంది. ఇన్వెస్టర్లు కొంటున్నారు. క్యాష్‌ సెగ్మెంట్‌ కావడంతో మొత్తం క్యాష్‌కే కొంటున్నారు. అప్పటికే కొన్ని వందల కోట్ల డీల్స్‌ జరిగాయి. శుక్రవారం షేర్‌ రూ. 16 వద్ద క్లోజైంది. అదే రోజు కూడా భారీగా కొన్నారు. అంటే ఒక షేర్‌ విలువ ఈవారాంతానికి జీరో అవుతుందని తెలిసీ ఎక్స్ఛేంజీ అధికారులు DHFL షేర్‌ ట్రేడింగ్‌కు అనుమతించారన్నమాట. అంటే ఈ డీల్‌ సంగతి తెలిసినవారు మార్కెట్‌లో అమ్మేశారన్నమాట. కంపెనీ నుంచి నోటీసు వచ్చిన వెంటనే ఎందుకు ట్రేడింగ్‌ ఆపలేదనేది ఇపుడు ప్రశ్న…