For Money

Business News

రామ్‌దేవ్‌ కంపెనీ నుంచి FPO

రామ్‌దేవ్‌ కంపెనీ పతంజలి ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎంత డిమాండ్‌ ఉందో కాని.. షేర్‌ మార్కెట్‌లో మాత్రం తన మాయ చూపించారు. ఏకంగా 99.03 శాతం షేర్లు తన దగ్గరే ఉంచుకుని కేవలం 0.97 శాతం షేర్లు మార్కెట్‌లో ఉంచి తన షేర్లను పెంచుకుంటూ పోయారు. రుచి సోయా అనే కంపెనీని 2020 జనవరి 27వ తేదీన రూ. 4,300కోట్లకు కొనుగోలు చేశారు. అప్పటికి రుచి సోయా షేర్లు ట్రేడ్‌ కాకకుండా సస్పెండ్‌ చేశారు. బాబా కొన్న తరువాత అదే రోజున అంటే జనవరి 27న రూ. 16.10 వద్ద లిస్టయింది. దివాలా తీసిన కంపెనీకి ఇంత రేటా అనుకున్నారు కొందరు. కాని బాబా అసలు మ్యాజిక్‌ అపుడే మొదలైంది. దేశంలో ఉన్న సెబీ, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు కళ్ళు మూసుకోవడంతో… ప్రతి రోజూ షేర్‌ ధరను పెంచుకుంటూ పోయారు. దాదాపు మొత్తం షేర్లు బాబా వద్దే ఉండటంతో షేర్‌ ధరను పెంచడం చాలా ఈజీ అయిపోయింది. సరిగ్గా జూన్‌ 26వ తేదీన రూ. 16.10 నుంచి రూ. 1,519లకు చేరింది. బాబా అడ్డుగోలు పెంపు గురించి మీడియా ఏకిపారేయడంతో దర్యాప్తు అంటూ డ్రామా మొదలైంది. అప్పటికే బాబా రూ. 4,300 కోట్ల కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 44,495 కోట్లకు చేరింది. కేవలం షేర్‌ మార్కెట్‌లో షేర్‌ను మేనేజ్‌ చేయడం ద్వారా ఇన్ని వేల కోట్లకు చేర్చారు బాబా. రుచి సోయా కొనేటపుడు ఓ కండీషన్‌ ఉంది. అదేమిటంటే మూడేళ్ళలో పబ్లిక్ షేర్‌ హోల్డింగ్‌ 25 శాతం ఉండేలా చూడాలి. ఇపుడు మార్కెట్‌ బాగుంది కాబట్టి… దాదాపు రూ. 4,300 కోట్ల సమీకరణకు బాబా ఇపుడు ఫాలోఅప్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) చేస్తున్నారు. అంటే తన దగ్గర ఉన్న 99.03 శాతం వాటాలో నుంచి 9 శాతం షేర్లను అమ్ముతారట. వచ్చే నెలలో పబ్లిక్‌ ఆఫర్‌ చేసేందుకు సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను రుచి సోయా దాఖలు చేసింది. ఈ నిర్ణయం రుచి సోయా షేరుపై ఎంత మేర పడుతుందో రేపు మార్కెట్‌లో చూడాలి. గత శుక్రవారం రుచి సోయా షేర్‌ రూ. 1,242 వద్ద ముగిసింది.