For Money

Business News

కరోనా ఎఫెక్ట్‌: మందగించిన నిర్మాణ రంగం

కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగం మళ్ళీ మందగించింది. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నుంచి నిర్మాణ రంగాన్ని మినహాయించినా.. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆంక్షలు ఉన్నాయి. నిర్మాణం జరిగే ప్రాంతంలోనే కార్మికులకు వసతి ఏర్పాటు కల్గించిన ప్రాజెక్టులకు మాత్రమే మహారాష్ట్ర అనుమతించింది. కార్మికుల్లో అధికశాతం 45 ఏళ్ళలోపు వాళ్ళు కావడంతో కరోనా భయం ఈ రంగాన్ని భయపెడుతోంది. 18-45 మధ్య వయస్కులకు టీకాలు వేస్తే తప్ప… నిర్మాణ రంగం పుంజుకునే పరిస్థితిలేదు. పైగా నిర్మాణం రంగం పనులు మొదలైతేగాని బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు. దీంతో దేశంలో అనేక రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు నత్తనడక సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మినహా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నడుస్తోంది. ఇదే పరిస్థితి మూడు, నాలుగు వారాలు కొనసాగే భవన నిర్మాణ కార్మికులు స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతారని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తక్కువ వడ్డీకి గృహ నిర్మాణ రుణాలు లభిస్తున్నా… ప్రాజెక్టులు ప్రారంభమైతేనే… రుణాలు మంజూరు అవుతాయి. ఒక్క మహారాష్ట్రలోనే భవన నిర్మాణంలో లక్ష మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది ముంబై, పుణెలో ఉన్నారు. ఈ రెండు నగరాల్లో కరోనా ఉధృతి అధికంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లోనూ నిర్మాణ పనులు కొనసాగిస్తున్న కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్థులు అంటున్నారు.దేశ వ్యాప్తంగా దాదాపు 4 లక్షల హౌసింగ్‌ యూనిట్లు ఇపుడు నిర్మాణ దశలో ఉన్నాయి. కేవలం ఒక నెల ఇక్కడ పని ఆగినా… ప్రాజెక్టుల నిర్మాణం మూడు, నెలలు ఆలస్యమౌతాయని వీరు అంటున్నారు. ఈసారి ద్వితీయ శ్రేణి నగరాల్లోని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులపై కూడా కరోనా ప్రభావం పడుతోంది.