For Money

Business News

ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం… ఒకేసారి చెల్లించలేం

తాము తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని… విద్యుత్ ప్లాంట్ల బకాయిలతో పాటు రెన్యూవబుల్‌ ఎనర్జి కంపెనీలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించే స్థితిలో లేమని ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఏపీ హైకోర్టుకు తెలిపాయి. జనవరి 1వ తేదీ నుంచి వీటికి ఏపీ డిస్కమ్‌లు బకాయిలు ఇవ్వలేదు. రెన్యూవబుల్‌ ఎనర్జి కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను ఆరు వారాల్లోగా చెల్లించాల్సిందిగా మార్చి 15న హైకోర్టు ఆదేశించింది. అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తమకు నెలవారీ చెల్లించే స్థోమత లేదని.. ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి ఏడాదిలోగా బకాయిలు చెల్లిస్తామని కోర్టుకు తెలిపాయి. కోర్టు ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో డిస్కమ్‌లు ఈ మేరకు కోర్టుకు విన్నవించాయి. అయితే డిస్కమ్‌ల విజ్ఞప్తిని కోర్టు ఇంకా పరిగణించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకపోవడం కావాలని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని.. తమ చేతులో లేని పరిస్థితుల కారణంగా బకాయిలు చెల్లించలేకపోతున్నామని.. కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేకపోతున్నందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామని డిస్కమ్‌లు కోర్టును వేడుకున్నాయి. విద్యుత్‌ కొనుగోలు బిల్లుల కింద తాము రూ. 13,011 కోట్లు చెల్లించాల్సి ఉందని, అలాగే తాము రూ. 28,599 కోట్ల నష్టంతో ఉన్నామని కోర్టుకు తెలిపాయి. వివిధ సంస్థల నుంచి తీసుకున్న రుణ మొత్తం రూ. 38,836 కోట్లు ఉందని, వాటిపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందని డిస్కమ్‌లు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల నుంచే తమకు రావాల్సిన బకాయిలు రూ. 9,115 కోట్లు ఉండగా, ప్రభుత్వ సబ్సిడీ కింద సరఫరా చేస్తున్న విద్యుత్తకు ప్రభుత్వం రూ. 3,087 కోట్లు ఇవ్వాల్సి ఉందని డిస్కమ్‌లు పేర్కొన్నాయి.