For Money

Business News

కుప్పకూలిన సింగపూర్ నిఫ్టి

అమెరికా మార్కెట్ల దెబ్బకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా మన మార్కెట్లకు అన్నీ అపశకునములే. కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ అయిపోయింది. క్రూడ్‌ మళ్ళీ 102 డాలర్లను తాకుతోంది. డాలర్‌ మరింత బలపడింది. డాలర్‌ ఇండెక్స్‌ 109ను దాటి 110 దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా శుక్రవారం అమెరికా మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. తమ అత్యధిక ప్రాధాన్యం ద్రవ్యోల్బణం కట్టడి చేయడమేనని, వృద్ధి రేటు తగ్గినా తాము పట్టించుకోమని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జెరోమ్‌ పావెల్‌ స్పష్టం చేయడంతో డాలర్‌ దూసుకు వెళ్ళింది. ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నాస్‌డాక్‌ ఏకంగా 3.94 శాతం క్షీణించింది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 కూడా 3.37 శాతం క్షీణించింది. ఇక డౌజోన్స్‌ కూడా మూడు శాతంపైగా నష్టపోవడంతో గ్రోత్‌ షేర్లకు దిక్కులేదు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. నిక్కీ, ఆస్ట్రేలియా మార్కెట్లు రెండు శాతం దాకా నష్టంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ ఒక శాతం నష్టపోగా తైవాన్‌ రెండున్నర శాత నష్టంతో ఉంది. దీంతో సింగపూర్ నిఫ్టి కూడా రెండు శాతంపైగా నష్టంతో ఉంది. ప్రస్తుతం సింగపూర్‌ నిఫ్టి 380 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17300 దిగువన ఓపెన్‌ కానుంది.