For Money

Business News

భారీ నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

అమెరికా మార్కెట్లు రాత్రి భారీ నష్టాలతో ముగిశాయి. టెక్‌, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగానే సాగింది. రాత్రి బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గినా…ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు సాగడం విశేషం. అలాగే డాలర్‌ స్వల్పంగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్ 104పైన ఉంది. రాత్రి నాస్‌డాక్‌ 2.98 శాతం క్షీణించగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ రెండు శాతం పడింది. ఇక డౌజోన్స్ కూడా 1.56 శాతం తగ్గింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా వాల్‌స్ట్రీట్‌ బాటలో ఉన్నాయి. కాకపోతే నష్టాలు ఆ స్థాయిలో లేవు. ప్రధాన సూచీలు ఒక శాతం మేర నష్టంతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు ఒక శాతం పైగా నష్టంతో ఉన్నాయి. చైనా మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. కేవలం నామ మాత్రపు నష్టాలతో నడుస్తున్నాయి. కోస్పి 1.78 శాతం, న్యూజిల్యాండ్‌ 1.5 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. రాత్రి క్రూడ్‌ ధరలు పెరిగాయి. ఇపుడు స్వల్ప నష్టాల్లో ఉన్నా.. బ్రెంట్ క్రూడ్‌ 103 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 1.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. సో నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 15700 దిగువకు చేరే అవకాశాలు ఉన్నాయి.