For Money

Business News

మీడియాలో రిలయన్స్‌ రూ. 12,000 కోట్ల పెట్టుబడి

రిలయన్స్‌ జియో మాదిరి మార్పులను మీడియా రంగంలో కూడా తెచ్చేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రెడీ అవుతోంది. ఈ మేరకు భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. దాదాపు రూ. 12,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమౌతోంది. ఇందులో కొంత ఆర్థిక సంస్థల నుంచి సమీకరిస్తుండగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సొంత నిధులను కూడా ఈ భారీ విస్తరణలో పెట్టనుంది. ఈ రంగలో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు హాట్‌స్టార్‌లతో పోటీకి రెడీ అవుతోంది. జీ-సోనీ మధ్య డీల్‌ తరవాత మీడియాలో అనేక మార్పులు రానున్నాయి. స్పోర్ట్స్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ రంగంలో కూడా రిలయన్స్‌ భారీగా విస్తరించాలని భావిస్తోంది. దీనికి గాను స్టార్‌, డీస్నీ ఇండియా మాజీ ఛైర్మన్‌ ఉదయ్‌ శంకర్‌తో కలిసి వ్యూహాన్ని ఖరారు చేస్తోంది.
అంతర్జాతీయ మీడియో మొఘల్‌ మర్డోక్‌ కుమారుడు జేమ్స్‌ మర్డోక్‌, ఉదయ్‌ శంకర్‌తో కలిసి రిలయన్స్‌ కొత్త వ్యూహానికి పదను పెడుతోంది. ఇందుకు గాను వయాకామ్‌18లో మెజారిటీ వాటా తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఈ కంపెనీలో రిలయన్స్‌కు ఇప్పటికే వాటా ఉంది. అయితే మెజారిటీ వాటా తీసుకోవాలని ముకేష్‌ అంబానీ భావిస్తున్నారు. ప్రస్తుతం వయాకామ్‌ 18లో వయాకామ్‌ సీబీఎస్‌కు 49 శాతం వాటా ఉంది. ఈ వాటాను పది శాతానికి తగ్గించుకోవడానికి వయాకామ్‌సీబీఎస్‌ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వయాకామ్‌ 18 ఇపుడు 53 ఛానల్స్‌ను నడుపుతోంది. ఈ ఛానల్స్‌కు 60 కోట్ల మంది ప్రేక్షకులు ఉన్నారు. వయాకామ్‌లో తాను 60 శాతం వాటా తీసుకునేందుకు రిలయన్స్‌ సిద్ధంగా ఉంది. మిగిలిన 40 శాతం ఉదయ్‌ శంకర్‌, జేమ్స్‌ మర్డోక్‌ తీసుకుంటారు. మరి వయాకామ్ సీబీఎస్‌ పూర్తిగా వైదొలగుతుందా? పాక్షిక వాటా ఉంచుకుంటుందా అన్నది తెలియడం లేదు. మొత్తానికి స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌లో భారీ మార్పులు రాబోతున్నాయి. అదే సమయంలో డిజిటల్ మీడియా ఏటా 25 శాతం వృద్ధిరేటుతో పరుగులు తీస్తోంది. కాబట్టి ఈ రంగంపై కూడా రిలయన్స్ కన్నేసింది. వయాకామ్ 18కు చెందిన వూట్‌ (Voot) స్ట్రీమింగ్‌ బిజినెస్‌లో మరింత పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌ రెడీ అవుతోంది.