For Money

Business News

పావు గంటలో 100 పాయింట్లు ఔట్‌

ఉదయం అనలిస్టులు హెచ్చరించినట్లే అయింది. దమ్ముంటే అధిక స్థాయిలో అమ్మండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ కొనుగోళ్ళు చేయొద్దని హెచ్చరించారు. ఒకవేళ చేతిలో పొజిషన్స్‌ ఉంటే ఉదయం అధిక స్థాయి వద్ద లాభాలు స్వీకరించమని. దమ్మున్న ఇన్వెస్టర్లకు అమ్మమని సలహా ఇచ్చారు. ఉదయం 18265 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి చివరి పావు గంటలో ఏకంగా 125 పాయింట్లు క్షీణించింది.గరిష్ఠ స్థాయితో పోలిస్తే 185 పాయింట్లు పడింది. అంటే ఉదయం అధిక స్థాయిలో అమ్మినవాడికి కాసుల పంట. చివర్లో 18080ని తాకిన నిఫ్టి 18105 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 86 పాయింట్లు పడింది. దీనికి ప్రధాన కారణం ఈటీఎఫ్‌ల అమ్మకాలు. సాధారణంగా కేలండర్‌ ఇయర్‌ చివర్లో ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌లు భారీగా అమ్మకాలు జరపుతాయి. ఇవాళ అమ్ముతారో లేదో తెలియని అనలిస్టులు… రిస్క్‌ తీసుకునే వారిని నిఫ్టిని అమ్మమని సలహా ఇచ్చాయి. పైగా ఎలాంటి పరిస్థితుల్లోనూ నిఫ్టిని కొనుగోలు చేయొద్దని డబుల్‌ హెచ్చరిక చేశారు. బ్యాంక్‌ నిఫ్టి 0.6 శాతం క్షీణించగా, నిఫ్టినెక్ట్స్‌ 0.15 శాతం నష్టపోయింది. అయితే మిడ్‌ క్యాప్‌ నిఫ్టి మాత్రం 0.45 శాతం పెరిగింది. ఇవాళ నిఫ్టిలో పెరిగిన బజాజ్ ఫైనాన్స్‌ టాప్‌లో ఉంది. ఈ షేర్‌ రెండు శాతం పెరిగింది. నిఫ్టి లూజర్స్‌లోని టాప్‌ అయిదు షేర్లు 1.5 శాతంపైగా నష్టపోవడం విశేషం. యూరోపియన్‌ షేర్లతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లో ఉన్నాయి. చూస్తుంటే మన మార్కెట్‌తో పాటు ప్రపంచ మార్కెట్లు కూడా 2022ను నష్టాలతో గుడ్‌బై చెప్పేలా ఉన్నాయి.