For Money

Business News

కోలుకున్నా… భారీ నష్టాలు తప్పలేదు

ఇవాళ మార్కెట్‌లో డాలర్‌తో ముడిపడిన రంగాలకు చెందిన షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఐటీ, ఫార్మా షేర్లలో ఈ విషయం చాలా స్పష్టంగా కన్పించింది. ఇంకా బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. ఒక్క మెటల్స్‌ షేర్లు మాత్రమే గ్రీన్‌లో ఉన్నాయి. ఉదయం నిఫ్టి 18,129 వద్ద ప్రారంభమై 17,884కు పడింది. అంటే 230 పాయింట్ల దాకా క్షీణించింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరోపియన్‌ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… నామమాత్రపు లాభాలకే పరిమితమయ్యాయి. పైగా అమెరికా ఫ్యూచర్స్‌ కూడా కేవలం బొటాబొటి లాభాలతో ట్రేడ్‌ కావడంతో మన ఇన్వెస్టర్లు కొనుగోళ్ళకు మొగ్గు చూపలేదు. భారీ నష్టాల తరవాత అమెరికా మార్కెట్లలో ఇవాళ రికవరీ అనుమానంగా కన్పిస్తోంది. దీంతో నిఫ్టికి పెద్ద మద్దతు అందలేదు. దీంతో నిఫ్టి 177 పాయింట్ల నష్టంతో 17,935 వద్ద ముగిసింది. పొజిషనల్‌ ట్రేడర్స్‌కు 18,000 స్థాయి అత్యంత కీలకం. ఈ స్థాయికి దిగువన క్లోజ్‌ కావడంతో… మున్ముందు పొజిషనల్‌ ట్రేడర్స్‌ నిఫ్టిని షార్ట్‌ చేస్తారా అన్నది చూడాలి. నిఫ్టిలో 35 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఎన్‌బీఎఫ్‌సీ నిఫ్టి ఒక శాతం నష్టపోగా, బ్యాంక్‌ నిఫ్టి అరశాతం నష్టపోయింది. అయితే మిడ్‌ క్యాప్‌ సూచీ మాత్రం క్రితం ముగింపు వద్దే ముగిసిందని చెప్పాలి.