For Money

Business News

1 నుంచి భూముల కొత్త రేట్లు?

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల కొత్త మార్కెట్ విలువల నిర్ధారణ ప్రక్రియను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తి చేసినట్లు ఈనాడు పత్రిక వెల్లడించింది. ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త మార్కెట్ విలువలను అమల్లోకి వచ్చేలా సన్నాహాలు ప్రారంభించారు.కొత్త మార్కెట్ విలువల నిర్ధారణ ప్రక్రియను పూర్తిచేశారని. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో అమలు చేయనున్న వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్ ప్లాట్ల కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేసినట్లు ఈనాడు పేర్కొంది. వీటిని ముఖ్యమంత్రి, కీలక మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించనున్నారు.
31 న రిజిస్ట్రేషన్లకు విరామం!
కొత్త మార్కెట్ విలువలకు అనుగుణంగా కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఒకటి రెండు రోజులు రిజిస్ట్రేషన్లకు విరామం ప్రకటించనున్నారు. వ్యవసాయ భూముల విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35-40 శాతం, అపార్ట్‌మెంట్ల ప్లాట్లవి 25-40 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్ల ప్లాట్ల ధరలు ఇప్పుడున్న మార్కెట్ విలువ కంటే 40-50 శాతం దాకా పెరిగినట్లు సమాచారం. సంగారెడ్డి, భువనగిరి, షాద్ నగర్ సహా హైదరాబాదు చేరువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనూ ఇదే విధంగా మదింపు చేశారు . కరీంనగర్ , ఖమ్మం , నిజామాబాద్ నగరపాలక సంస్థలతో పాటు రియల్ ఎస్టేట్ జోరు కొనసాగుతున్న కొత్త ప్రాంతాలు మంచిర్యాల, నల్గొండ, మిర్యాలగూడ, మహబూబ్ నగర్ , సూర్యాపేట వంటి జిల్లా కేంద్రాల్లో పెంపును ప్రత్యేక అంశంగా పరిగణించారు. బహిరంగ మార్కెట్లో విలువ బాగా ఉండి తక్కువకు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్న వాటిని పరిగణనలోకి తీసుకుని కొత్త రేట్లను నిర్ణయించారు. రియల్ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్న వ్యవసాయ భూములున్న ప్రాంతాలకు కొత్త రేట్లను లెక్క కట్టారని ఈనాడు పత్రిక పేర్కొంది.