For Money

Business News

17 శాతం తగ్గిన నికర లాభం

ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐసీ ఇవాళ మార్చితో ముగిసిన త్రైమాసానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెకండరీ మార్కెట్‌లో కంపెనీ షేర్లు లిస్టయిన తరవాత ఆర్థిక ఫలితాలను తొలిసారి వెల్లడించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ. 2409 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన రూ. 2917 కోట్లతో పోలిస్తే ఈ సారి నికర లాభం 17.4 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం 11.64 శాతం పెరిగి రూ. 1,89,176 కోట్ల నుంచి రూ. 2,11,471 కోట్లకు చేరింది. ఇక మార్చితోముగిసిన పూర్తి ఏడాదికి అంటే 2021-22లో నికరలాభం 39.4 శాతం పెరిగి రూ. 2900 కోట్ల నుంచి రూ. 4043 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. ఒక్కో షేరుకు రూ 1.5 డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
మార్చితో ముగిసిన తాజా త్రైమాసికంలో కంపెనీ నికర ప్రీమియం ఆదాయం రూ. 17.88 శాతం పెరిగి రూ. 1,44,158 కోట్లకు చేరింది. తొలి ఏడాది కట్టిన ప్రీమియం మొత్తం కూడా 32.65 శాతం పెరిగి రూ. 14663 కోట్లకు చేరింది. అలాగే రెన్యూవల్‌ ప్రీమియం 5.37 శాతం పెరిగి రూ. 71,472 కోట్లకు చేరింది. సింగిల్‌ ప్రీమియం 33.7 శాతం పెరిగి రూ. 58,250 కోట్లకు చేరింది.