For Money

Business News

కేసీఆర్‌ రుణభేరీ

దేశంలో రాష్ట్రాలు తీసుకునే రుణాలపై కేంద్రం ఆంక్షలకు విధించడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా గళం విప్పాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవసరమైతే అసెంబ్లీ సమావేశపరిచి రుణ సేకరణపై కేంద్రం విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల మీడియా సమావేశంలోకూడా ఆయన ఇదే విషయమై తన వైఖరి స్పష్టం చేశారు. కేంద్రం తీసుకునే రుణాలు జీడీపీలో 96 శాతానికి చేరాయని… ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత కేంద్రం అప్పులు తడిసిమోపెడయ్యాయని ఆయన మీడియాసమావేశంలో చెప్పారు. దేశాన్ని అప్పులు పాలు చేస్తున్న కేంద్రం… రాష్ట్రాలపై ఆంక్షలు విధించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీ కూడా రుణ ఊబిలో కూరుకుపోయింది. ఈ అంశంపై ఏపీతో కాకుండా దేశంలోని ఇతర పక్షాల మద్దతు కూడగట్టాలని ఆయన భావిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి దీనిపై పలు పార్టీల నేతలతో భేటీ కావాలని భావిస్తున్నారు. నిన్న ప్రగతిభవన్లో జరిగిన పల్లె, పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో తాను ఢిల్లీకి వెళ్లే విషయాన్ని సీఎం వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు ఇవాళ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దేశ రాజధానికి వెళ్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులను కలిసి ఆంక్షలను ఎత్తివేయాలని కోరనున్నారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యం అప్పులు తెచ్చి అనేక పథకాలు అమలు చేస్తోందని, అదే రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేపట్టకుండా మోకాలడ్డుతోందని కేసీఆర్‌ ఆరోపిస్తున్నారు.