For Money

Business News

ఈక్విటీ మార్కెట్లలో అల్లకల్లోలం

అమెరికాల్‌ బేర్‌ మార్కెట్‌ కరెక్షన్‌ చాలా జోరుగా ఉంది. అమెరికాలో స్వల్ప స్థాయిలో మాంద్యం ఉందని నివేదికలు వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ షేర్లను తెగనమ్ముకుంటున్నారు. ముఖ్యంగా టెక్‌, ఐటీ షేర్లకు దిక్కేలేదు. రాత్రి అమెరికా మార్కెట్‌లో అమెజాన్‌ నుంచి ఆపిల్‌ వరకు… మైక్రోసాఫ్ట్‌ నుంచి గూగుల్‌ వరకు ప్రతి పెద్ద ఐటీ షేర్‌ ఆరు శాతంపైగా క్షీణించింది. టార్గెట్‌ లిమిటెడ్‌ షేర్‌ 25 శాతం క్షీణించింది. 1987 తరవాత ఈ కంపెనీ షేర్‌ ఈ స్థాయిలో పడటం ఇదే మొదటిసారి. డాలర్‌ ఇండెక్స్‌ 104 వద్ద ఉండటం, అమెరికా క్రూడ్‌ కూడా 108 డాలర్ల వద్ద ఉండటంతో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అరికట్టడానికి ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని ఫెడ్‌ ఛైర్మన్‌ ప్రకటించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. చాలా రోజుల తరవాత ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా నాలుగు శాతంపైగా పడింది. ఇక నాస్‌డాక్‌ ఏకంగా 4.73 శాతం క్షీణించింది. డౌజోన్స్‌ 3.57 శాతం పడటం మార్కెట్‌ వర్గాలను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఎందుకంటే ఎకానమీ షేర్లు పడటం మొదలైందంటే… ఈక్విటీ మార్కెట్‌ కచ్చితంగా కరెక్షన్‌లోకి వెళ్ళినట్లే.