For Money

Business News

సింగపూర్ నిఫ్టి… బుల్స్‌ పరార్‌…

గత ఏడాది అక్టోబర్‌ వరకు మార్కెట్‌లో జూమ్, బూమ్‌ తప్ప పతనం ఎరుగని షేర్‌ మార్కెట్లకు బేర్‌ పవర్‌ ఏమిటో ఇపుడిపుడే కనిపిస్తోంది. షేర్‌ మార్కెట్‌ లాభాలనేవి కొండెక్కడం లాంటివని… నష్టాలు కొండపై నుంచి జారడమేనని ఇపుడు ప్రత్యక్షంగా తెలుస్తోంది. కరోనా సమయంలో మార్కెట్‌ జెట్‌ స్పీడ్‌తో పడి… అదే స్పీడుతో కోలుకుంది. ఈసారి మాత్రం క్రమంగా ఇన్వెస్టర్ల లాభాలు కరిగిపోతున్నాయి. ముఖ్యంగా గత ఏడాది పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన చాలా షేర్లు ముఖ్యంగా న్యూజ్‌ ఏజ్‌ కంపెనీల షేర్లు 50 శాతం నుంచి 70 శాతం వరకు పడ్డాయి. నిన్న రాత్రి అమెరికాలో వచ్చిన పతనం ప్రభావం ఆసియా మార్కెట్లను వణికిస్తోంది. కొనడంలో, అమ్మడంలో అమెరికా ఇన్వెస్టర్లు ఎంత నిర్దయగా ఉంటారో మన ఇన్వెస్టర్లకు తెలుస్తోంది. ఉదయం నుంచి అమెరికా మార్కెట్లతో లింకు ఉన్న ఆసియా మార్కెట్లన్నీ కుప్పకూలాయి. హాంగ్‌ కాంగ్ మార్కెట్‌ ఇపుడు 3.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అమెరికాలో లిస్టయిన అనేక చైనా కంపెనీలు హాంగ్‌ కాంగ్‌లో ట్రేడవుతాయి. అలాగే జపాన్‌ మార్కెట్లు. నిక్కీ 2.55 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇవన్నీ ఆరంభ నష్టాలే. మున్ముందు ఎంత పడుతాయో చూడాలి. చైనా మార్కెట్లు కూడా ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌, తైవాన్‌ వంటి మార్కెట్లు రెండు శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి కూడా రెండు శాతం నష్టంతో ఉంది. 315 పాయింట్లకు పైగా నష్టంతో SGX నిఫ్టి ట్రేడవుతోంది. సో… నిఫ్టి ఓపెనింగ్‌ ట్రేడ్‌లోనే 16000 స్థాయిని మళ్ళీ కోల్పోనుంది.