For Money

Business News

IPL: ప్రసార హక్కులు రూ.50,000 కోట్లు!

కరోనా గోల లేకుండా ఈసారి మనదేశంలోనే ఐపీఎల్‌ మ్యాచులన్నీ సాఫీగా జరుగనున్నాయి. దీంతో ఈసారి హడావుడి అధికంగా ఉండబోతోంది. పైగా రెండు కొత్త టీమ్‌లు కూడా చేరాయి. దీంతో ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కుల బిడ్డింగ్‌ ఈ ఏడాది జరుగనుంది. ఈసారి అమెజాన్‌, రిలయన్స్‌ కూడా పోటీ పడనున్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. కోట్ల వ్యూస్‌ను సంపాదించే పెట్టే ఈ మ్యాచ్‌ల ప్రసారం కోసం ఈ సారి పోటీ తీవ్రంగా ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లను టీవీతోపాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసార హక్కుల కోసం వచ్చే ఐదేళ్ల కాలానికి దాదాపు రూ .50 వేల కోట్ల వరకు వెచ్చించేందుకు అమెజాన్, రిలయన్స్‌ సిద్ధమైనట్లు రాయిటర్స్‌ సంస్థ పేర్కొంది. ఈసారి ఐపీఎల్‌ను టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ స్పాన్సర్ చేస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ ప్రసార హక్కులు వాల్ట్ డిస్నీ గ్రూప్‌నకు చెందిన స్టార్ ఇండియాకు ఉన్నాయి. 2017లో ఐదేళ్ల కాలానికి ఈ కంపెనీ రూ.16,348 కోట్లకు దక్కించుకుంది. అంటే ఈ ప్రసార హక్కులు ఈ ఏడాది అంటే 2022తో ముగుస్తున్నాయి. దీంతో వచ్చే అయిదేళ్ళ కోసం ఈ ఏడాది బిడ్డింగ్‌ నిర్వహించనున్నారు.స్పోర్ట్స్‌ విభాగంపై దృష్టి సారించిన స్టార్‌ ఇండియా ఇపుడు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా దక్కించుకుంటోంది. పైగా సోనీ నుంచి ఇప్పటికే పోటీని ఎదుర్కొంటోంది. తాజాగా ఈ హక్కుల కోసం అమెజాన్‌, రిలయన్స్‌ కూడా పోటీ పడుతున్నాయి. అంటే నాలుగు ప్రధాన కంపెనీలు పోటీ పడుతున్నాయన్నమాట. వయాకామ్‌18ను టేకోవర్‌ చేసేందుకు రియలన్స్‌ ఇప్పటికే 160 కోట్ల డాలర్లను విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించనుంది. దీంతో స్పోర్ట్స్‌ ఛానల్స్‌ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే స్పానిష్‌ లా లిగా హక్కులను కూడా రిలయన్స్‌ కొనుగోలు చేసింది.