For Money

Business News

…. లేదంటే బొగ్గు సరఫరా కట్‌ చేస్తాం

కేంద్ర ప్రభుత్వం చివరికి రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరించే స్థాయికి వచ్చింది. జూన్‌ 15కల్లా దిగుమతి చేసుకున్న బొగ్గు ఆయా ప్లాంట్లకు చేరాలని, విద్యుత్‌ ఉత్పత్తిలో విదేశీ బొగ్గు కచ్చితంగా పది శాతం ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు హుకూం జారీ చేసింది. వెంటనే బొగ్గు దిగుమతి కోసం కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని పేర్కొంది. ఎవరైనా జూన్‌ 15కల్లా దిగుమతి బొగ్గు తెచ్చుకోని పక్షంలో… బొగ్గు సరఫరాలో 5 శాతం కోత విధిస్తామని స్పష్టం చేసింది. అంటే ఆ తరవాత ఈ థర్మల్‌ ప్లాంట్లు 15 శాతం దిగుమతి బొగ్గు వినియోగించాలన్నమాట. దేశీయంగా విద్యుత్‌ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో జూన్‌ 15కల్లా దిగుమతి చేసుకున్న థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు చేరాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. కేటాయించిన బొగ్గులో 50 శాతం జూన్‌ 30కి, మరో 40 శాతం ఆగస్టు చివరికి సరఫరా చేయాలని కేంద్రం బొగ్గు కంపెనీలకు పేర్కొంది. మిగిలిన 10 శాతం అక్టోబర్‌ చివరికి అందుతుంది. ఏప్రిల్‌, మేనెలలో దిగుమతి చేసుకున్న బొగ్గును వాడని పక్షంలో… సదరు ప్లాంట్లు అక్టోబర్‌ వరకు దిగుమతి బొగ్గు 15 శాతం , నవంబర్‌ నుంచి 2023 వరకు పది శాతం మేర విదేశీ బొగ్గు వాడాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. కేంద్రం తాజా నిర్ణయంపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచకుండా… అదానీ కంపెనీల ద్వారా బొగ్గు దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోందని సోషల్‌ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.