For Money

Business News

భారీగా పెరిగిన ద్రవ్యలోటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ఏడాది బడ్జెట్‌ అంచనాలో 21.2 శాతానికి చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ద్రవ్యలోటు 18.2 శాతం మాత్రమే ఉండేది. పైగా ఈ మూడు నెల్లలో బడ్జెట్‌లో వేసిన అంచనాతో పోలిస్తే ఖర్చులకంటే ఆదాయం ఎక్కువగా వచ్చినా… ద్రవ్య లోటు రూ. 3.52 లక్షల కోట్లకు చేరింది. అంటే నెలకు రూ.1.2 లక్షల కోట్లు ఉంటోందన్న మాట. ఈ మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వసూళ్ళు రూ.5.96 లక్షల కోట్లు కాగా, ఖర్చు రూ.9.48 లక్షల కోట్లు. పూర్తి ఏడాది బడ్జెట్‌లో వేసిన వసూళ్ళలో మూడు నెలల వసూళ్ళు 26.1 శాతం రాగా, ఏడాది ఖర్చులో 3 నెలలకు పెట్టిన ఖర్చు 24 శాతం మాత్రమే. అంటే ఖర్చు కూడా 26 శాతం చేసి ఉండుంటే.. ద్రవ్యలోటు మరింత పెరిగేది. మొత్తం వసూళ్ళు రూ. 5.96 లక్షల కోట్లు కాగా అందులో రెవెన్యూ వసూళ్ళే రూ. 5.68 లక్షల కోట్లు ఉండటం విశేషం. అందులోనూ రూ. 5.06 లక్షల కోట్లు పన్నుల ద్వారా సమకూర్చుకున్నవే. పన్నేతర ఆదాయం రూ. 62,160 కోట్లు. అంటే రెవెన్యూ లోటే రూ. 2.05 లక్షల కోట్లు ఉందని తాజా గణాంకాలు వెల్లడించాయి.